* ప్రజాశక్తి వార్తకు స్పందన
* మూడు గంటలపాటు జాతీయ రహదారిపై స్తంభించిన వాహనాల రాకపోకలు
* సర్వీస్ రోడ్డు నిర్మాణానికి హామీతో ఆందోళన విరమణ
ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : పీలేరులో ఆర్‌ఓబీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నత్త నడకన ఆర్‌ఓబీ పనులు’ శీర్షికన ప్రజాశక్తిలో ప్రచురితమైన వార్తకు స్పందనగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో మహిళలు, స్థానిక ప్రజలు మంగళవారం చిత్తూరు రైల్వే గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పీలేరులో ఆర్ఓబి నిర్మాణం పనులు చేపట్టి సుమారు నాలుగు ఏళ్లు దాటినా నిర్మాణం పనులు పూర్తి కాకపోగా, కనీసం సర్వీస్ రోడ్డు కూడా నిర్మించకపోవడంతో ఉన్న రోడ్డు గుంతలమయంగా మారడంతోపాటు దుమ్ము విపరీతంగా లేస్తుండటంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనతో జాతీయ రహదారిపై సుమారు మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. చిత్తూరు మార్గంలో వాహనాలు నిలిచిపోవడంతో అవి అదే రోడ్డులోని ఎంజెఆర్ ఇంజనీరింగ్ కళాశాల వరకు బారులు తీరి నిలబడి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ శివకుమార్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ లోకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం వారు కాంట్రాక్టర్‌ను అక్కడికి రప్పించి సర్వీస్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇప్పించడంతో ప్రజలు, నాయకులు ఆందోళన విరమించారు. ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయడంతోపాటు రహదారిపై గుంతలను పూడ్చి, దుమ్ము సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ధర్నాలో కూటమి నాయకులు కోటపల్లి బాబురెడ్డి, పోలిశెట్టి సురేంద్ర, పసుపులేటి లక్ష్మీకర్, స్పోర్ట్స్ మల్లి, నల్లారి రియాజ్, కోడి రామకృష్ణారెడ్డి, కోటపల్లి శ్రీనాథ్‌రెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)