- బైరెడ్డిపల్లి టీడీపీ అభ్యర్థిగా భువనచంద్ర గౌడ్ నామినేషన్
- ఏకగ్రీవంపై రాజకీయ వర్గాల్లో చర్చ
ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి: పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తూ, కష్టకాలంలోనూ అండగా నిలిచిన కార్యకర్తకు సముచిత గుర్తింపు లభించింది. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్న భువనచంద్ర గౌడ్‌కు బైరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మండల కేంద్రం బీసీ జనరల్‌కు కేటాయించడంతో టీడీపీ అధిష్ఠానం భువనచంద్ర గౌడ్‌ను అభ్యర్థిగా ఖరారు చేయగా, ఆయన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేసిన కుటుంబ నేపథ్యం భువనచంద్ర గౌడ్‌కు కలిసివచ్చింది. ఆయన తండ్రి స్వర్గీయ రమణప్ప గౌడ్ సీనియర్ రిపోర్టర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా, టీడీపీ ఆవిర్భావం నుంచి మండలంలో పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పార్టీ నాయకులతో, రాష్ట్రస్థాయి నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రాజకీయంగా తనదైన ముద్ర వేశారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న భువనచంద్ర గౌడ్‌కు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు ప్రోత్సాహకరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిష్టాత్మకంగా బైరెడ్డిపల్లి పంచాయతీ
మండలంలోని 21 గ్రామపంచాయతీల్లో బైరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ కావడంతో ఇక్కడ సర్పంచ్ పదవికి ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యత ఉంది. మిగిలిన 20 పంచాయతీలతో పోలిస్తే మండల కేంద్రం కావడం, రాజకీయంగా కీలక స్థానం కలిగి ఉండటంతో అన్ని పార్టీల దృష్టి ఈ పంచాయతీపైనే కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున భువనచంద్ర గౌడ్ నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మరోవైపు ఆయనను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో బైరెడ్డిపల్లి పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమవుతుందా? లేక పోటీ అనివార్యమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కూటమి బలంపై టీడీపీ నేతల ధీమా
ఇటీవల జరిగిన పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించడం, బైరెడ్డిపల్లి మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 16 స్థానాలకు గాను 11 స్థానాలను కూటమి కైవసం చేసుకుని ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇదే ఊపుతో రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ మండలంలోని 21 పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు విజయబావుటా ఎగురవేస్తారని మండల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏకగ్రీవాలతో అభివృద్ధికి సహకరించాలి: కిషోర్ గౌడ్
ఈ సందర్భంగా బైరెడ్డిపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు బి.ఎం. కిషోర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పరస్పర సహకారంతో ఏకగ్రీవ ఎన్నికలకు ముందుకు రావాలని కోరారు.
ప్రభుత్వం ప్రకటించిన ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల ప్రోత్సాహక నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏకగ్రీవాలకు అవకాశం కల్పించని పక్షంలో తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మండలంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపిస్తారనే నమ్మకం తమకు ఉందని కిషోర్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తంగా బైరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఈసారి మండల రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకోగా, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తకు అవకాశం కల్పించడం, ఏకగ్రీవ ఎన్నికలపై సాగుతున్న చర్చలు రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.







కామెంట్లు (0)