ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'స్థానిక' ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

3 గంటల క్రితం

'స్థానిక' ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రజాశక్తితో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 06:00 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- ప్రజాశక్తితో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

​ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : ​జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థకు నవంబర్ 26న ఎన్నికలు జరుపుతున్నామన్నారు. అలాగే జిల్లాలో మూడు విడతల్లో 379 గ్రామపంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాను ఉంచుతున్నామని, వేలం పాటలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయనతో నిర్వహించిన ముఖాముఖీ..

కాకినాడ నగరపాలక సంస్థ, గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.?

​కాకినాడ నగరపాలక సంస్థతో పాటు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నాం.

​కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఏమిటి.?

​కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 66 వార్డులకు కార్పొరేటర్లతో పాటు మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహించనున్నాం. ఇందుకోసం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అవసరమైతే నవంబర్ 27న రీపోలింగ్ నిర్వహిస్తాం. నవంబర్ 30న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

​కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది.?

​నవంబర్ 14 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటి రోజు రిటర్నింగ్ అధికారులు పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. నవంబర్ 14, 15, 16 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 19న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అభ్యర్థులు, పోలీసు సిబ్బందికి అవసరమైన శిక్షణ కూడా పూర్తి చేశాం.

​ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు, ప్రజలకు సందేహాలు వస్తే ఎవరిని సంప్రదించాలి.?

​అభ్యర్థులు, ప్రజల సందేహాలు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా 89788-45559 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఎన్నికల ప్రక్రియలో మొదటి ఆర్.ఒ నామినేషన్ల స్వీకరణతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు బాధ్యతలు నిర్వహిస్తారు. రెండో ఆర్.ఒ. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలను పర్యవేక్షిస్తారు.

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఎన్ని విడతల్లో నిర్వహించనున్నారు?

​కాకినాడ జిల్లాలో మొత్తం 385 గ్రామపంచాయతీలు ఉన్నాయి. న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న ఆరు పంచాయతీలను మినహాయించి, ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మిగిలిన 379 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తాం.

​మూడు విడతల్లో ఎన్నికలు జరిగే మండలాలు, పంచాయతీల వివరాలు తెలియజేయండి?

​మొదటి విడతలో నవంబర్ 26న కాకినాడ రూరల్, కరప, తాళ్లరేవు, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లోని 93 గ్రామపంచాయతీలు, వాటి పరిధిలోని 1,064 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తాం. రెండో విడతలో నవంబర్ 29న పెద్దపూడి, కాజులూరు, గొల్లప్రోలు, పిఠాపురం, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లోని 149 గ్రామపంచాయతీలు, 1,684 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. మూడో విడతలో డిసెంబర్ 2న కోటనందూరు, తుని, తొండంగి, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి మండలాల్లోని 137 గ్రామపంచాయతీలు, 1,478 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తాం.

ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తోంది.?

​గ్రామపంచాయతీల అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహక నిధులను ప్రకటించింది. 5 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు,10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందిస్తారు. ఈ నిధులను గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించాలి.

​

సర్పంచ్ పదవులకు వేలం పాటలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై మీ స్పందన ఏమిటి.?

​కొన్ని ప్రాంతాల్లో సర్పంచ్ స్థానాలను వేలం పాటల ద్వారా ఎంపిక చేస్తున్నారనే సమాచారం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఎవరైనా నిర్దిష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

​ నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?

​నామినేషన్ కేంద్రాల లోపల, వెలుపల సిసి టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. నామినేషన్ల దాఖలు, స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తాం. ఎవరు, ఏ సమయంలో నామినేషన్ దాఖలు చేశారు, ఎవరు ఉపసంహరించుకున్నారు. అనే వివరాలు స్పష్టంగా రికార్డుల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

​

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కొత్త ప్రాంతాలను ఎన్నికల్లో చేర్చే అవకాశం ఉందా.?

​ఎన్నికల సంఘం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాంతాలు, వార్డుల పరిధిలోనే ప్రస్తుత ఎన్నికలు నిర్వహిస్తాం. కొత్తగా ఇతర ప్రాంతాలను ఈ ఎన్నికల ప్రక్రియలో చేర్చడం సాధ్యం కాదు. న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న ఆరు గ్రామపంచాయతీలకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పరిశీలించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం.

​

ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?

​ఎన్నికల్లో ప్రలోభాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నిశితంగా పరిశీలిస్తాం. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్