ప్రజాశక్తి - నిడదవోలు
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కోరారు. గురువారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో కూటమి ముఖ్య నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంలో పట్టాలు తప్పిన పాలనా వ్యవస్థను, ఆర్థిక స్థితిగతులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే గాడిన పెట్టిందని అన్నారు. వైసిపి హయాంలో జరిగిన కక్షసాధింపు, విధ్వంసకర పాలనను పటాపంచలు చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రగతిపూర్వక సుపరిపాలనకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. వైసిపి ఐదేళ్ల పాలన విధ్వంసకరంగా సాగితే, కూటమి పాలన వికాసవంతంగా ముందుకు సాగుతోందని అన్నారు.
నిడదవోలు మున్సిపాలిటీ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణతో చర్చించి పట్టణానికి 'స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ' హోదా సాధించామని, దీనివల్ల పట్టణాభివృద్ధికి భారీగా నిధులు సమకూరుతాయని తెలిపారు. 2014-19 మధ్య టిడిపి నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తే ఎక్కడ నాటి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని భయపడి, ఐదేళ్ల పాటు వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి శిథిలావస్థకు తెచ్చిందన్నారు. గతంలో లబ్ధిదారులు పడ్డ సాధకబాధలు చూసి ఆవేదన చెందామని, కూటమి ప్రభుత్వంలో రూ.8.80 కోట్లతో మౌలిక వసతులు కల్పించి, మరో 6 నెలల్లో లబ్ధిదారుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇళ్లను అందజేస్తామన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు కేవలం గొయ్యి తవ్వి వదిలేసిందని, కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ శాంక్షన్లు సాధించి అద్భుతమైన వసతులు, వైద్యులతో కూడిన 100 పడకల ఆస్పత్రిని త్వరలోనే నిర్మించి తీరుతుందని స్పష్టం చేశారు.ఈ విషయంలో వైసిపి చేస్తున్న ఆరోపణలన్నీ కేవలం అవాస్తవాలు, కుట్రపూరితమన్నారు. రూ.3.62 కోట్లతో చినకాశీరేవు పునరుద్ధరణ, కోటసత్తెమ్మ దేవాలయంలో భక్తుల వసతులు, శెట్టిపేట వద్ద బోటింగ్, పార్క్, వేసైడ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే రూ.7 కోట్ల గోదావరి పుష్కర నిధులతో ఘాట్ల పునర్నిర్మాణం, నిత్యహారతి కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే, కేవలం 11 మంది ఉన్న వైసిపి నేతలు అసెంబ్లీకి రావడానికే భయపడుతున్నారని ఆక్షేపించారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది వారి సొంత రాజకీయం కోసమా? చట్టసభకు రాని రోజే వారు ఓట్లు అడిగే అర్హత కోల్పోయారని, రేపు స్థానిక ఎన్నికల్లో గెలిచినా మున్సిపల్ కౌన్సిల్‌కు వస్తారనే గ్యారెంటీ ఉందా? అలాంటప్పుడు వైసిపి ఓటెయ్యాల్సిన అవసరం ప్రజలకు ఏముందిని అన్నారు. ఓట్లు అడిగే నైతిక హక్కు వైసిపికి లేదని అన్నారు. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్, టిడిపి ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమిలో ఎలాంటి విబేధాలు లేవని, ఎప్పుడూ ఐక్యంగానే ఉంటుందని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఎన్డీయే కూటమి మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నిడదవోలు పట్టణ ప్రాంత అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కడితే అభివృద్ధికి పట్టం కట్టినట్లేనని తెలిపారు. కూటమి ఛైర్ పర్సన్ అభ్యర్థి మురాల జ్యోతి మాట్లాడుతూ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నిడదవోలులో రూ.500 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే నిడదవోలు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజల అమూల్యమైన ఓటు కూటమికి వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)