గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

త్వరలోనే కొత్త పెన్షన్ల మంజూరుకు చర్యలు

1 గంట క్రితం

త్వరలోనే కొత్త పెన్షన్ల మంజూరుకు చర్యలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 03:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - నిడదవోలు

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా ఒకటో తేదీనే క్రమం తప్పకుండా 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని 9వ వార్డులో మంత్రి కందుల దుర్గేష్ ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సిసి రోడ్డు పాడైపోవడం వల్ల డ్రెయినేజీ నీరు రోడ్డుపైకి వస్తుందని, పాములు వస్తున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన వచ్చే నెలలోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పరామర్శించి రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆసుపత్రి యాజమాన్యంతో ఫోన్ ద్వారా మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వ పరంగా తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ పట్టణంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సంబంధించి మొత్తం 4,081 పెన్షన్ల ద్వారా రూ.1,83,34,000 లు పంపిణీ చేస్తున్నామన్నారు. అక్టోబర్ నెలలో కొత్తగా 3 పెన్షన్లు మంజూరు చేయగా వాటికి రూ.12000 అందిస్తున్నామన్నారు. మొత్తంగా కొన్ని కారణాల వల్ల తొలగించబడిన పెన్షన్ లు పొగా 4061 మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశామన్నారు. నిడదవోలు టౌన్ నుంచి కొత్త పెన్షన్ల కోసం మొత్తం 933 మంది దరఖాస్తు చేసుకున్నారని, సరైన పత్రాలు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా 146 దరఖాస్తులను అనర్హులుగా గుర్తించామన్నారు. మిగిలిన 780 కొత్త పెన్షన్ల మంజూరుకు తుది నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అక్టోబర్ 7న జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని తెలిపి త్వరితగతిన కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. వచ్చే నెల నుంచి వీటికి సంబంధించిన పింఛన్లు అందించేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్