ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి
రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం గుంటూరులోని పలు బియ్యం దుకాణాల్లో తనిఖీలు చేశారు. బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విజిలెన్సు అధికారులతో పాటు
జిల్లా తూనికలు, కొలతల అధికారి, జిఎస్‌టి అధికారులు గుంటూరు పట్టణంలో మార్కెట్ సెంటర్, చేపల మార్కెట్ రోడ్డు నందుగల పలు హోల్సేల్ అండ్ రిటైల్ బియ్యం దుకాణాల వద్ద సంయుక్తంగా తనిఖీలు చేశారు. బిపిటి, హెచ్ఎంటి వివిధ రకాల బియ్యం వెరైటీలను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అమ్మాలని దుకాణ యజమానులకు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కన్నా ఎక్కువ ధరలకు అమ్మినట్లు స్పష్టమైన ఆధారాలు వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొలతలు, సరైన ప్యాకింగ్ ముద్రణ వివరాలు లేకుండా కొన్ని వెరైటీల బియ్యం బస్తాలను అమ్ముతున్న పలు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. 25 కేజీలు, తక్కువ కేజీలు బియ్యం వెరైటీలకు సంబంధించిన జిఎస్టి విభాగం అధికారులకు పూర్తిస్థాయి తనిఖీలు చేస్తామని అధికారులు తెలిపారు. వెంకటేశ్వర ట్రేడర్స్, సాంబశివ జనరల్ స్టోర్స్, కార్తికేయ రైస్ ట్రేడర్స్, శ్రీనివాస రైస్ మర్చంట్ దుకాణాల్లో తనిఖీలు చేసినట్టు తెలిపారు. ఎక్కడైనా అధిక ధరలకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అమ్మకాలు జరుగుతున్నా, బ్లాక్ మార్కెటింగ్ ఇతర అక్రమ చర్యలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలపాలన్నారు.








కామెంట్‌లు (0)