ప్రజాశక్తి ప్రత్తిపాడు
ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒడిషా ఏజెన్సీ ప్రాంతం నుండి మహారాష్ట్ర వైపునకు తరలిస్తున్న దాదాపు రూ.కోటీ 35 లక్షల విలువైన భారీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఒడిషా నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్టు శుక్రవారం పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్తిపాడు సిఐ బి.సూర్య అప్పారావు ఆదేశాల మేరకు, ఎస్ఐ ఎస్.లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద మారుతీ వ్యాగన్ఆర్ కారును తనిఖీ చేయగా, అందులో బస్తాల్లో నింపిన భారీ గంజాయి నిల్వలు బయటపడ్డాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న వివరాల ప్రకారం మొత్తం 8 బస్తాలలో ఉన్న 270.750 కిలోల గంజాయి విలువ మార్కెట్లో రూ. కోటీ 35 లక్షలు ఉంటుందని గంజాయితో పాటు కారును, నిందితుల వద్ద నుంచి రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆదిరాజు నాయుడు, పోతురాజు మణికంఠ, మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరుద్దరూ అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం, బేన్నభూపాలపట్నం గ్రామానికి చెందినవారని తెలిపారు. ఈ కేసులో అసలు సూత్రధారి, ప్రధాన నిందితుడైన అదే గ్రామానికి చెందిన జెర్రిపోతుల వంశీ కృష్ణ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.








కామెంట్లు (0)