ప్రజాశక్తి-గుంటూరు
వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహించనున్న ‘ఐసీఏఎంఏఎంఏఈ–2026’ (అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఏఐ–డ్రివెన్ ఇంజినీరింగ్) అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ కౌశిక్ బిస్వాస్ మాట్లాడుతూ ప్రాథమిక ఇంజినీరింగ్ పరిజ్ఞానం, పదార్థాల అంతర్గత నిర్మాణంపై సమగ్ర అవగాహన ఉంటేనే నూతన ఆవిష్కరణలు సాధ్యమని పేర్కొన్నారు. కేవలం ఆధునిక సాంకేతికతలను అనుసరించడమే కాకుండా, మెటీరియల్స్ యొక్క మెకానికల్, ఫిజికల్, మెటలర్జికల్ లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారానే మెరుగైన ఇంజినీరింగ్ పరిష్కారాలను అభివృద్ధి చేయగలమని వివరించారు. 3డీ ప్రింటింగ్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్ వంటి రంగాల్లో వస్తున్న మార్పులు ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక పరిణామాలకు దోహదపడుతున్నాయని వివరించారు. ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్. కిషోర్ బాబు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధునిక ఇంజినీరింగ్‌లో కీలక సాధనమైనప్పటికీ, అది ఎప్పటికీ ప్రాథమిక మెకానికల్ ఇంజినీరింగ్ సూత్రాలకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. సదస్సులో వివిధ విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)