లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి : రాష్ట్ర అధ్యక్షులు విప్పర్తి కొండలరావు
ప్రజాశక్తి - సామర్లకోట (కాకినాడ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలని ఏపీ బేవరేజెస్ హమాలీల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి. కొండలరావు డిమాండ్ చేశారు. సామర్లకోటలోని ఏపీఎస్‌బీసీఎల్ ఐఎంఎఫ్ఎల్ డిపోలో ఆదివారం నిర్వహించిన హమాలీల యూనియన్ ఎనిమిదో రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. అలాగే సిఐటియు జిల్లా నాయకులు రొంగల ఈశ్వరరావు, సిఐటియు మండల నాయకులు బాలం శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ ... 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులకు భంగం కలుగుతోందని, యజమానులకు అనుకూలంగా ఈ చట్టాలను రూపొందించారని విమర్శించారు. తక్షణమే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.42 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం తీసుకురావాలని కోరారు. లేబర్ కోడ్‌ల రద్దు కోరుతూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సామర్లకోట యూనియన్ కార్యదర్శి అమలకంటి సోమేశు గత కాలపు కార్యక్రమాల నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు.
నూతన అధ్యక్ష కార్యదర్శి లు గా శ్రీనివాస్, శివరామ కృష్ణ ...
అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బిక్కిన శ్రీనివాస్, కార్యదర్శిగా సందల శివరామకృష్ణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పప్పుల సత్తిబాబు, జాయింట్ సెక్రటరీగా పెంకి ఏడుకొండలు, కోశాధికారిగా నక్క నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా యాండ్రపు శ్రీనివాస్, బైరెత్తి సూర్య సత్యనారాయణ, నాలం శివరామకృష్ణ, నాలం తిరుమలరావు, అమలకంటి సోమేశు, త్రిమూర్తులు, నీలం వీరబాబు, అల్లు సతీష్‌కుమార్ ఎన్నికయ్యారు. అనంతరం చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ నాయకుడు రొంగల ఈశ్వరరావు, సీఐటీయూ మండల నాయకుడు బాలం శ్రీనివాస్‌తో పాటు అధిక సంఖ్యలో హమాలీ కార్మికులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)