ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒడిశా సరిహద్దుల్లో గిరిజనులకు రక్షణ కల్పించండి : సిపిఐ(యం) డిమాండ్

18 నిమిషాల క్రితం

Provide protection to tribals along the Odisha border CPIM demands
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 04:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కొటియా గ్రామాలు, శ్రీకాకుళం జిల్లా మందస మండలం మాణిక్యపురం పంచాయతీలోని గిరిజనులపై ఒడిశా పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించి ఆదివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో సంప్రదించి ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వాల మధ్య వివాదాల్లో ప్రజల్ని బలిపశువుల్ని చేయొద్దని సిపిఐ(యం) విజ్ఞప్తి చేసింది. కేంద్రంలోనూ ఒడిశాలోనూ బిజెపి ప్రభుత్వాలే ఉన్నాయన్నారు. కేంద్రంలో టిడిపి భాగస్వామిగా ఉందని తెలిపారు. డబల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకోవడానికి బదులు సమస్యను పరిష్కరించి తమ నిజాయితీ నిరూపించుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నదన్నారు. దాదాపు 90 ఏళ్లుగా ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించకుండా గిరిజనులపై ఒడిశా పోలీసులు విరుచుకుపడటం అమానుషమన్నారు. గ్రామాలపై పడి ఒడిశా పోలీసులు గిరిజనులను విచ్చలవిడిగా అరెస్టు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌనంగా ఉండడం గర్హనీయమన్నారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా ఒడిశా పోలీసులు, బిజెపి నాయకులు కలిసి రోడ్లు దిగ్బంధనం చేసి కొటియా గ్రామస్తులను ఓట్లు వేయనీయకుండా అడ్డుపడ్డ విషయం అందరికీ తెలిసిందేనన్నారు ! ఇప్పుడు జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో కూడా స్థానిక గిరిజనులు పాల్గొనకుండా చేసేందుకు ఒడిశా పోలీసులు ఏకంగా అటు కొటియా గ్రామాలపైన, ఇటు మాణిక్యపురం పంచాయతీపైన దాడిచేసి, ఎన్నికలలో పోటీ చేసిన, చేయనున్న అభ్యర్థులను శనివారం బలవంతంగా తమ అదుపులోకి తీసుకున్నారని వివరించారు. కొటియా ప్రాంతంలోని గంజాయి భద్ర, పట్టు చెన్నూరు, పగులు చెన్నూరు గ్రామాలకు చెందిన పదిమందిని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇద్దరిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. మాణిక్యపట్నం పంచాయతీలో మాణిక్యపట్నం, బిత్తరబంధ, మద్దికట్ల గ్రామాలకు చెందిన సవర విప్రో, జిత్తు, లక్ష్మిలను ఒడిశా పోలీసులు నిర్బంధించి బలవంతంగా వారి నామినేషన్లను ఉపసంహరింప చేశారని అన్నారు. ఈ తతంగమంతా మందస మండల కేంద్రంలోనే జరిగినా ఆంధ్రప్రదేశ్ అధికారులు చేష్టలుడిగి వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఒడిశా పోలీసుల నిర్బంధంలో ఉన్న గిరిజనులను వెంటనే విడుదల చేయించాలని, ఆయా గ్రామాల్లోని ప్రజలకు సంపూర్ణమైన భద్రత కల్పించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నదన్నారు. ఈ సమస్యకు మూలమైన అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
cpim letter


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్