ఈదురు గాలులు.. భారీ వర్షంతో స్తంభించిన జనజీవనం. పలుచోట్ల నేల వాలిన వరిచేలు.. కర్ఫ్యూను తలపిస్తున మెయిన్ రోడ్లు.
ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : అర్నాబ్ తుఫాను ప్రభావంతో కోనసీమలోని రామచంద్రాపురంలో ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలు ఈదురుగాలులకు జనజీవనం స్తంభించింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రయాణికులు బయటకు రాకపోవడంతో మెయిన్ రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణం తలపించాయి. ఈదురుగాలులకు భయపడి ప్రజలు బయటకు రావడానికి సాహసించలేదు. మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతాలైన కోటిపల్లి, వాసాలరేవు, మసకపల్లి, బ్రహ్మపురి, తదితర తీరప్రాంతాల మత్స్యకారులు వేటకు వెళ్లడం విరమించుకున్నారు. పడవలన్నీ ఒడ్డుకు చేర్చారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. దీనికి తోడు వర్షాభావం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వరిచేలు ఈదురుగాలులకు నేలకొరిగాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు గాలులు వీచే అవకాశం ఉండటంతో మరింత ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మత్స్యకారులతోపాటు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని తుఫాను ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.









కామెంట్‌లు (0)