ప్రజాశక్తి-రాజోలు
భారత ప్రభుత్వం పిలుపు మేరకు ప్రపంచ మానసిక ఆరోగ్య మాసోత్సవాల్లో భాగంగా మలికిపురం మండలం బట్టేలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మానసిక ఆరోగ్య మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు., డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ వివివి. ప్రసాద్ పెసల ఆధ్వర్యంలో అవగహనా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికికూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చదువులో ఒత్తిడి, పరీక్షల భయం, ఆందోళన, తోటి విద్యార్థులతో సమస్యలు వంటి అంశాలను ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. తమలో కలిగే భావాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా కౌన్సెలర్లతో పంచుకోవాలని, అవసరమైనప్పుడు సహాయం తీసుకోవడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన పోస్టర్ల ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. పోస్టర్ల ద్వారా భావోద్వేగాల గుర్తింపు, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం, పరస్పర సహకారం, అవసరమైనప్పుడు సహాయం కోరడం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు.
ప్రతి విద్యార్థి తన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఇతరుల భావాలను గౌరవిస్తూ, ఆరోగ్యకరమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని కార్యక్రమంలో సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి షేక్ మహబూబ్ బాషా , ఎపిసి మమ్మి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రమాదేవి ప్రధానోపాధ్యాయులు ఎన్.వి.యస్.యస్.హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎ.గంగా ప్రసాద్, పూర్ణ ప్రసాద్ ,విద్యార్థులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)