డబ్బు సంచులతో సీట్లు కొనుక్కుని, ఓట్లు దండుకుని, గెలవడానికి ప్రయత్నిస్తున్న పార్టీలకు, నేతలకు బుద్ధి చెప్పండి
కేంద్రానికి.. రాష్ట్రం... రాష్ట్రానికి ...స్థానిక సంస్థలు దాసోహం అనే నేతలు వద్దు, ధైర్యంతో నగరం కోసం గళం విప్పే కమ్యూనిస్టులను ఎన్నుకోండి
అమరావతి పేరుతో.. విజయవాడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న కూటమిని ఓడించండి, విజయవాడ అభివృద్ధికై పోరాడే కమ్యూనిస్టులను, కార్పొరేటర్లుగా, మేయర్ గా ఏబి. వెంకటేశ్వరావును గెలిపించండి
బియ్యం , నిత్యావసర వస్తువులు ధరల పెంపుదల, విద్యుత్, ఇతర భారాలకు భారాలపై... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని ఓటు రూపంలో తెలపండి
విజయవాడ నగరపాలక సంస్థను అవినీతిపరుల బారి నుండి కాపాడుకుందాం, కమ్యూనిస్టులను, నీతిమంతులను గెలిపిద్దాం : సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సిపిఎం కమ్యూనిస్టులు... 78,80 82 డివిజన్లలో ప్రచార క్యాంపెయిన్ లో పాల్గొన్న బాబురావు
విజయవాడ : ధైర్యంతో నగరం కోసం గళం విప్పే కమ్యూనిస్టులను ఎన్నుకోండి అని సిహెచ్.బాబూరావు పిలుపునిచ్చారు. నేడు విజయవాడ అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ తదితర ప్రాంతాలలో 78,80, 82 డివిజన్ల లో సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థులు శివ పార్వతి రెహనా బేగం, రజని, కమ్యూనిస్టులు కాంగ్రెస్ బలపరిచిన స్వతంత్ర మేయర్ అభ్యర్థి ఏబి వెంకటేశ్వరరావు గెలుపు కోసం.... బాబురావు, సిపిఐ సిపిఎం నేతలు కే.భాస్కరరావు, బి. రమణ రావు ఇతర నేతలు విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. సభలలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ .... కూటమి పార్టీలు సీట్లు పంచుకోవడం కాదు, విజయవాడ నగరానికి ఏం చేశారో ప్రజలకు సంజాయిషీ చెప్పాలన్నారు. గత వైసిపి ప్రభుత్వం... కేంద్ర బిజెపి ప్రభుత్వ ఆదేశాలతో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టగా, ఆనాడు దాన్ని వ్యతిరేకించిన టిడిపి, కూటమి నేడు అదే విధానాన్ని కొనసాగించడం దుర్మార్గమన్నారు. గత ఆరేళ్లలో పాలకులు 130% పైగా ఇంటి పన్నులు పెంచి పట్టణ ప్రజల నడ్డి విరిచారని దుయ్యబట్టారు. ఆస్తి పన్నుల విధానాన్ని సమీక్షిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న కూటమి మాట తప్పిందని, నగర ప్రజలను మోసగించిందని విమర్శించారు. ప్రజా పోరాటంతో చెత్త పన్ను రద్దు చేయక తప్పలేదన్నారు. 673 జీవో ద్వారా యూజర్ చార్జీల పేరుతో మళ్లీ దొడ్డి దారిన చెత్త పన్ను ప్రవేశ పెట్టే కుట్రలకు కూటమి తెరదీసిందన్నారు. పన్నుల భారాలు మోపటంలో ముందున్న కూటమి, నగరానికి నిధులు ఇవ్వటంలో మాత్రం వైఫల్యం చెందిందన్నారు. కూటమి నేతలు ఎన్నికైతే ప్రభుత్వానికి భజన చేయటం తప్ప, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు తేగలిగిన సత్తా వారికి ఉండదు అని చెప్పారు. విజయవాడలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా మృతనగరం (డెడ్ సిటీ) లాగా మార్చుతుంటే టిడిపి, కూటమి ప్రజాప్రతినిధులు నోరు మెదపకుండా, తమ పదవులను కాపాడుకోవటం సిగ్గుచేటన్నారు. డబ్బు సంచులతో సీట్లు కొనుక్కుని, అమ్ముకుంటున్న నేతలకు అవినీతిపై తప్ప ప్రజాసేవపై దృష్టి ఉండదు అని ధ్వజమెత్తారు. పదేళ్లు కమ్యూనిస్టుల పాలనలో విజయవాడ నగరం సమగ్రంగా అభివృద్ధి చెందిందని, ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నదని అన్నారు. కమ్యూనిస్టులు ప్రతిపక్షంగా ఉండి నీటి మీటర్లు ,చెత్త పన్ను, పన్నుల భారాలు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలు కమ్యూనిస్టులు పాలకపక్షంగా ఉండి రాష్ట్రంలోని మున్సిపాలిటీలలోని ప్రజాప్రతినిధులు అందరినీ కూడగట్టి స్థానిక సంస్థలకు నిధులు కోసం గళం విప్పిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. పలు పార్టీలు పాలకులుగా నగరాన్ని అవినీతిమయం చేశారనీ, నగరపాలక సంస్థను బ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఇటువంటి దుస్థితిలో విజయవాడ నగరపాలక సంస్థను రక్షించడానికి ప్రత్యామ్నాయ విధానాలు అవసరం, నాయకత్వం మరింత అవసరం అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో దశలవారీగా విజయవాడ నగరాన్ని అమ్మివేసే కూటమి పార్టీలు, నేతలకు అడ్డుకట్ట వెయ్యండి విజయవాడను రక్షించడానికి కమ్యూనిస్టులను గెలిపించండి అని నినదించారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇతర సంఘాలు బలపరుస్తున్న స్వతంత్ర మేయర్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుకు అఖండ విజయం చేకూర్చండి అని కోరారు. సిపిఎం, సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తున్న వార్డులలో వారిని గెలిపించండి, అభ్యుదయ శక్తులను, నీతిమంతులకు పట్టం కట్టండి అని అన్నారు. పార్టీలకతీతంగా పౌర సమాజం ఏకం కావాలి విజయవాడ రక్షణకు నడుం బిగించాలి అని బాబూరావు పిలుపునిచ్చారు. నేడు జరిగిన ఈ ప్రచార కార్యక్రమాలలో సిపిఎం నేతలు బి.రమణ రావు, నిజాముద్దీన్, సిహెచ్. శ్రీనివాస్, పీర్ సాహెబ్, సిపిఐ నేతలు భాస్కరరావు, గురునాథం తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)