- నాటకరంగానికి విశిష్ట సేవలు..
- పలు పురస్కారాలతో ఘన సత్కారాలు..
ప్రజాశక్తి-ఎన్టీఆర్ ప్రతినిధి : కళామతల్లి ముద్దుబిడ్డ, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, ఆల్ ఇండియా రేడియో వక్త చింతా కబీర్ దాస్ శనివారం విజయవాడలోని అయన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు.
నాటకరంగానికి తన జీవితాన్ని అంకితం చేసి, నటుడిగా, దర్శకుడిగా, వక్తగా విశిష్ట సేవలందించిన ఆయన 1933లో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించారు. ఆయన విజయవాడలోని ఆంధ్రా సిమెంట్ కంపెనీలో స్టోర్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కళారంగంపై తనకున్న అపారమైన ఆసక్తితో నాటకరంగంలో అడుగుపెట్టి, నటుడిగా, దర్శకుడిగా విశేష ప్రతిభను చాటుకున్నారు. నాటకరంగంలో ఎనలేని కీర్తిని ఆర్జించి, తనదైన ప్రత్యేక ముద్రను వేశారు. ఆల్ ఇండియా రేడియోలో వక్తగా కూడా ఆయన పేరుప్రఖ్యాతులు సంపాదించారు. అనేక నాటక పరిషత్‌లకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి, నాటకరంగానికి తనవంతు సేవలందించారు.
కళారంగంలో విశిష్ట గుర్తింపు...
చింతా కబీర్ దాస్ నాటకరంగ సేవలను గుర్తించి పలు సంస్థలు ఆయనను ఘనంగా సత్కరించాయి.
కందుకూరి ప్రతిష్ఠాత్మక రంగస్థల పురస్కారం – 2017 : నాటకరంగానికి విశిష్ట సేవలు అందించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో కందుకూరి ప్రతిష్ఠాత్మక రంగస్థల పురస్కారం అందుకున్నారు.
“నటనాచార్య” బిరుదు – 27 మార్చి 2008 : నాటకరంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ 2008 మార్చి 27న చింతా కబీర్ దాస్ కి “నటనాచార్య” బిరుదును ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. అభినందనలు, వందనాలు తెలియజేస్తూ శారదా కళా సమితి విజయవాడ, అభిరుచి, విజయవాడ; ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, విజయవాడ సంస్థలు సన్మాన పత్రంను అందజేశారు.
కీ.శే.శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారం :
సుమధుర కళానికేతన్, విజయవాడ వారి 39వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన 17వ రాష్ట్రస్థాయి హాస్య నాటికల పోటీలలో చింతా కబీర్ దాస్ కి “శనగల కబీర్ దాస్ గారి స్మారక పురస్కారం” ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
అంతేకాకుండా, ఆయన కళా ప్రతిభను, నాటకరంగానికి అందించిన సేవలను గుర్తిస్తూ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) వారు 2011లో కాలిఫోర్నియాలో చింతా కబీర్ దాస్ ని ఘనంగా సత్కరించారు.
నటుడిగా, దర్శకుడిగా, వక్తగా, నాటకరంగ న్యాయ నిర్ణేతగా కళారంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన చింతా కబీర్ దాస్ మృతి నాటకరంగానికి, కళాభిమానులకు తీరని లోటుగా నిలిచింది. ఆయనతో అనుబంధం ఉన్న కళాకారులు, నాటకరంగ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయన సేవలను స్మరించుకుంటూ శోకతప్త హృదయాలతో అశ్రునివాళి అర్పిస్తున్నారు.









కామెంట్‌లు (0)