ప్రజాశక్తి-పల్నాడు జిల్లా
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులందరికీ ఓటు హక్కు కల్పించాలని, అదే సమయంలో అనర్హులు ఓటర్ల జాబితాలో చేరకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరెడ్డి, ఎం.మోహనరావు కోరారు. శుక్రవారం యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేసి, పలు అంశాలపై చర్చించారు. గత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అర్హత లేని కొందరు వ్యక్తులు ఓటర్లుగా నమోదయ్యారనే అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో, ఈసారి ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని వారు కోరారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు,కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకుల దరఖాస్తులను కేవలం యాజమాన్యాలు జారీ చేసే సర్వీస్ సర్టిఫికెట్ల ఆధారంగా కాకుండా, సంబంధిత విద్యాశాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించిన తర్వాతే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల సర్వీసు కాలాన్ని నిర్ధారించేందుకు అటెండెన్స్ రిజిస్టర్లు, జీతాల చెల్లింపులకు సంబంధించిన బ్యాంకు వివరాలు, పిఎఫ్ చెల్లింపులు, యూ-డైస్ రికార్డులను పరిశీలించాలని సూచించారు. గత 6 ఏళ్లలో కనీసం మూడేళ్లపాటు పని చేసినట్లు ఆధారాలతో నిర్ధారణ అయిన వారి దరఖాస్తులనే ఆమోదించాలని కోరారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్'ఎయిడెడ్ విద్యా సంస్థలు, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఐటీఐ, జూనియర్ కళాశాలలు, ఫార్మసీ, మెడికల్, ఫిజియోథెరపీ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకుల దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు, ఉన్నతాధికారుల కౌంటర్ సంతకాలతో ధృవీకరించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే వారి సర్వీసు వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ధృవీకరించాలని, ఒకే విద్యాసంస్థ నుంచి బహుళ దరఖాస్తులు వచ్చినప్పుడు కవరింగ్ లెటర్ తో సమగ్రంగా పంపే విధంగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అదే విధంగా గత ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించిన జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేసే సిఆర్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఈసారి కూడా ఓటు హక్కు కల్పించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అనర్హుల నమోదు జరగకుండా కట్టుదిట్టమైన పరిశీలన వ్యవస్థను అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విశ్వసనీయతను కాపాడుతూ రాబోయే ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు, జిల్లా సౌహర్ధ ప్రతినిధి టి.వెంకటేశ్వర్లు, నరసరావుపేట పట్టణ అధ్యక్షులు పూర్ణచంద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి డి.కోటేశ్వరరావు, ఈపూరు మండల అధ్యక్షులు ఎం.నాగేశ్వర నాయక్, నాదెండ్ల మండల గౌరవాధ్యక్షులు నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)