అమరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రజాశక్తి-ఒంగోలు సిటీ : ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు నిత్యం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయం, పెరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసుల పేర్లను అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు చదివి వినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే గొప్ప సేవ అని పేర్కొన్నారు. పోలీసు విధి నిర్వహణలో అనేక సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో గత ఏడాది కాలంగా నేరాల రేటు తగ్గుముఖం పట్టిందని, రోడ్డు భద్రత, మహిళల రక్షణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని తెలిపారు.
ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన పది మంది భారత పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, ఫ్యాక్షనిజం, ఇతర అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ పోలీసులు సమాజ రక్షణకు అంకితమవుతున్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ఆధునిక పోలీసింగ్ విధానాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ (ఐపీఎస్), లేళ్ల శంకర్ (జూనియర్ కమాండర్, గ్రేహౌండ్స్), మోటా ఆంజనేయులు (జూనియర్ కమాండర్, గ్రేహౌండ్స్), కె.వి. ప్రశాంతరావు (ఏఎస్‌ఐ), చప్పిడి వెంకటరత్నం (ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్), ఎస్.కె. మహమ్మద్ రఫీ (కానిస్టేబుల్), ఈ. పవన్ కుమార్ (కానిస్టేబుల్) సేవలను ఎస్పీ కొనియాడారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది వరకు ప్రకాశం జిల్లా పోలీసు శాఖకు చెందిన 12 మంది సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. అనంతరం పోలీసు అమరవీరుల ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప రవాణా శాఖ కమిషనర్ ఆర్. సుశీల, అదనపు ఎస్పీలు ఎన్. యుగంధర్ బాబు, వెంకటేశ్వర్లు, ఏఆర్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీధర్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)