సరోగసీ ద్వారా తొలి సంతానం.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు
నెదర్లాండ్స్ : నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ (39), ఆయన భాగస్వామి, అర్జెంటీనా అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా తమకు తొలి బిడ్డ జన్మించబోతున్నట్లు ఈ జంట వెల్లడించింది. 2027లో తమ జీవితాల్లోకి చిన్నారి రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జంట ఆనందాన్ని పంచుకున్నారు.
‘‘మా జీవితాల్లోకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. చిన్నారి.. 2027లో కలుద్దాం. అండదాతకు, సరోగసీ తల్లి లీసాకు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు’’ అంటూ ఆ జంట భావోద్వేగ పోస్టు చేసింది.
ఈ బిడ్డ కోసం నెదర్లాండ్స్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు సహకరించినట్లు జెట్టెన్ పార్టీ డెమోక్రాట్స్ 66 (D66) తెలిపింది. వారిలో ఒకరు అండాన్ని దానం చేయగా, మరొకరు సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వడానికి ముందుకొచ్చారు. ఈ సహకారాన్ని ఎలాంటి వాణిజ్య ప్రయోజనాలు ఆశించకుండా అందించారని పేర్కొంది. నెదర్లాండ్స్‌లోనే ఐవిఎఫ్ (IVF) ద్వారా గర్భధారణ ప్రక్రియ పూర్తయిందని, దేశ నిబంధనలకు అనుగుణంగానే ఏర్పాట్లు జరిగినట్లు వెల్లడించింది. అక్కడ డబ్బు చెల్లించి సరోగసీ చేయించుకోవడం చట్టవిరుద్ధం.
పెళ్లి వాయిదా.. చిన్నారి కోసం ఎదురుచూపులు ....
రాబ్ జెట్టెన్, నికోలస్ కీనన్ 2024 నవంబరులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేసవిలో వివాహం చేసుకోవాలని భావించినప్పటికీ, జెట్టెన్ ప్రధాని బాధ్యతలు చేపట్టడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. బిడ్డ జన్మించిన తర్వాత కుటుంబంతో గడిపేందుకు ఆయన కొన్ని రోజులు సెలవు తీసుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ తెలిపింది. అయితే, సుదీర్ఘకాలం తల్లిదండ్రుల సెలవు తీసుకునే ఆలోచన లేదని పేర్కొంది. 2001లో స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశంగా నెదర్లాండ్స్ చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఆ దేశ ప్రధాని తండ్రి కాబోతున్న వార్త అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.







కామెంట్‌లు (0)