గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

“మా నాన్నలకు ఉపాధి ఇవ్వండి” : దీక్షల్లో పసిపిల్లలు

1 గంట క్రితం

“మా నాన్నలకు ఉపాధి ఇవ్వండి” : దీక్షల్లో పసిపిల్లలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 01:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

11వ రోజుకు చేరుకున్న బిల్ కలెక్టర్ల రిలే నిరాహార దీక్షలు

“మా నాన్నలకు ఉపాధి ఇవ్వండి” దీక్షల్లో పసిపిల్లలు

కుటుంబాలతో సహా పోరాటంలో పాల్గొన్న పత్తికొండ, కర్నూలు ఈఆర్ఓల బిల్ కలెక్టర్లు


తిరుపతి : ఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తొలగించాలన్న యాజమాన్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ .... ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారంతో 11వ రోజుకు చేరుకున్నాయి. 11వ రోజు దీక్షల్లో పత్తికొండ ఈఆర్ఓ, కర్నూలు ఈఆర్ఓ పరిధిలోని బిల్ కలెక్టర్లు తమ కుటుంబాలతో సహా పాల్గొన్నారు. బిల్ కలెక్టర్లతో పాటు వారి భార్యలు, పిల్లలు కూడా దీక్షల్లో పాల్గొనడం అందరినీ కదిలించింది. ముఖ్యంగా ఒక సంవత్సరం వయసున్న చిన్నారుల నుంచి పదేళ్ల వయసున్న పిల్లల వరకు ఈ దీక్షలో కూర్చున్నారు. తమ తండ్రులకు ఉపాధి కల్పించాలని కోరుతూ దీక్ష చేపట్టారు. మెడలో దీక్షా మాలలు వేసుకుని తల్లిదండ్రులతో కలిసి కూర్చున్న చిన్నారుల దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.


“మా నాన్నలకు ఉద్యోగం ఇవ్వండి… మా చదువులకు ఫీజులు కట్టాలి… మా కుటుంబాలను ఆదుకోండి” అంటూ చిన్నారులు విజ్ఞప్తి చేసిన తీరు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థకు సేవలు అందిస్తున్న బిల్ కలెక్టర్లను ఒక్కసారిగా ఉపాధి నుంచి తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, అప్పులు తదితర సమస్యలతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోయారు. 11 రోజులుగా కుటుంబాలతో సహా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ ఎస్పీడీసీఎల్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్ కలెక్టర్ల కుటుంబాల పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి, వారి ఉపాధిని కొనసాగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ తక్షణమే స్పందించి బిల్ కలెక్టర్ల సమస్యను పరిష్కరించాలని వారికి ఉపాధి, భద్రత కల్పించాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి. “పసిపిల్లల కన్నీళ్లు చూసైనా స్పందించండి — బిల్ కలెక్టర్ల కుటుంబాలను ఆదుకోండి” అని విన్నవించాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్