ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్చల్

1 గంట క్రితం

Herd of elephants creates a stir in Chandragiri.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 03:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు రెండు బృందాలుగా విడిపోయి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. భాకరాపేట, దిగువూరు ప్రాంతాల నుంచి 13 ఏనుగులతో కూడిన గుంపు చంద్రగిరి వైపు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. మరో 22 ఏనుగులతో కూడిన గుంపు శేషాచలం అటవీ ప్రాంతం గుండా తిరుమల వైపు పయనిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఏనుగుల కదలికలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో భీమవరం, చిన్నరామాపురం, కొండ్రెడ్డికండ్రిగ తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైతులు ముఖ్యంగా రాత్రివేళల్లో ఒంటరిగా పంట పొలాల వద్దకు వెళ్లవద్దని, ఏనుగుల సంచారం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపించినా వాటి వద్దకు వెళ్లడం, ఫొటోలు లేదా వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం, వాటిని తరిమే చర్యలకు పాల్పడవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. ఏనుగుల కదలికలు కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి, వన్యప్రాణుల రక్షణతో పాటు ప్రజల భద్రతకు సహకరించాలని అధికారులు కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్