పీలేరులో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది
‘ఠాగూర్’ సినిమా తరహాలో వైద్య మోసం..!
పీలేరు ఎస్కేఆర్ ఆసుపత్రి వ్యవహారంపై సమగ్ర విచారణకు సిపిఎం డిమాండ్
తిరుపతి : ఠాగూర్ సినిమా తరహాలో ... పీలేరులో వైద్యుల తీరు వెలుగుచూసింది. కిడ్నీలోని రాళ్లు తీయాలని ఆపరేషన్ చేయాలని బాధితుడి కుటుంబీకుల వద్ద డబ్బు తీసుకొని రోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు.. ఆ వ్యక్తి చనిపోయాడు.. మరణించినా ఇంకా బతికే ఉన్నట్లు డ్రామా నడిపిన వైనం తెలియడంతో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
అసలేం జరిగిందంటే ....
కేవీపల్లి మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన కె.సురేంద్ర (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటి కారణంగా నొప్పులు వస్తున్నాయని పీలేరులోని ఎస్కేఆర్ ఆసుపత్రి వైద్యులను బుధవారం సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం సురేంద్రను గురువారం ఆసుపత్రిలో చేర్చుకుని, కిడ్నీలోని రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి సుమారు రూ.35,000 తీసుకున్నారని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్‌కు సంబంధించి మత్తు మందు ఇచ్చే సమయంలో సురేంద్ర ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని, అనంతరం ఆయన మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బంధువులకు స్పష్టంగా తెలియజేయకుండా, అత్యవసర చికిత్స అవసరమంటూ పీలేరు నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి ఎస్కేఆర్ ఆసుపత్రి అంబులెన్స్‌లో తరలించినట్లు వారు ఆరోపించారు. సురేంద్ర అప్పటికే మరణించి ఉన్నప్పటికీ, అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందిస్తున్నట్లు చూపిస్తూ తిరుపతికి తీసుకొచ్చారని కూడా బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉదయం 9 గంటల సమయంలో స్విమ్స్ క్యాజువాల్టీకి తీసుకొచ్చిన అనంతరం అక్కడి వైద్యులు సురేంద్రను పరీక్షించి పల్స్ లేదని, ఆయన మరణించినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు, బంధువుల రోదనలతో స్విమ్స్ ప్రాంగణంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న సిపిఎం నాయకులు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒక వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులు, పీలేరు ఎస్కేఆర్ ఆసుపత్రిలో అందించిన వైద్యం, మత్తు మందు ఇచ్చిన అనంతరం జరిగిన పరిణామాలు, స్విమ్స్‌కు తరలించే సమయానికి సురేంద్ర ఆరోగ్య పరిస్థితి, అంబులెన్స్‌లో అందించిన అత్యవసర వైద్యం తదితర అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. వైద్య నిర్లక్ష్యం లేదా ఇతర తప్పిదాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)