దక్షిణ భారతదేశంలో విద్యా విప్లవం సృష్టిస్తాం..అలఖ్ పాండే
ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, రంగంపేట దగ్గర ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణం సోమవారం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశంలోనే ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ 'ఫిజిక్స్ వాలా' , మోహన్ బాబు యూనివర్సిటీల మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రో చాన్సలర్ మంచు విష్ణు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఛాన్సలర్, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు, ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే, డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, వైస్ ఛాన్సలర్ పి.వి. రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణను అందించడమే లక్ష్యంగా ఇరు సంస్థలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మోహన్ బాబు మాట్లాడుతూ .... నేటి తరం విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. ఒక సాధారణ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ప్రారంభమైన తన జీవిత ప్రయాణం విలన్, కమెడియన్, హీరోగా సాగి, నిర్మాతగా, రాజ్యసభ సభ్యుడిగా, చివరికి ఒక విశ్వవిద్యాలయ స్థాపకుడిగా రూపాంతరం చెందడం వెనుక నిరంతర శ్రమ, అపారమైన క్రమశిక్షణ ఉన్నాయని తన అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలు, సోషల్ మీడియా వంటి అనవసర విషయాలపై సమయం వృధా చేయకుండా, చదువుపై పూర్తి దృష్టి సారించి తల్లిదండ్రుల త్యాగాలను సార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయానికి వచ్చే ప్రతి విద్యార్థిని తన సొంత బిడ్డగా భావిస్తానని, వారు సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే తనకు నిజమైన గర్వం, సంతృప్తి లభిస్తాయని ఆకాంక్షించారు. అలాగే, మారుతున్న కాలానికి అనుగుణంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రతి ఏటా సరికొత్త సాంకేతికతను, డిజైన్లను అందుబాటులోకి తెస్తూ దేశంలోనే మొదటిసారిగా వినూత్న విద్యా విధానాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

అనంతరం ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే మాట్లాడుతూ .... తానూ ఒకప్పుడు యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి వచ్చి కోచింగ్ ఫీజులు భరించలేక, హైదరాబాద్, కోటి వంటి ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక ఎన్నో ఇబ్బందులుపడ్డానని గుర్తు చేసుకున్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఉచితంగా యూట్యూబ్‌లో బోధన ప్రారంభించి, నేడు అత్యంత తక్కువ రుసుముతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు చెప్పారు. యూట్యూబ్‌లో 6.5 కోట్లకు పైగా, యాప్‌లో 60 లక్షల మందికి పైగా విద్యార్థులకు 54 రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ప్రపంచస్థాయి గుర్తింపు సాధించామని తెలిపారు. గడిచిన కొన్నేళ్లుగా దక్షిణాదిలో ఆశించిన స్థాయిలో మార్పు తీసుకురాలేకపోయామని, ఇకపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అలఖ్ పాండే స్పష్టం చేశారు. రాబోయే మూడు నాలుగు నెలల కాలాన్ని దక్షిణాది విద్యార్థుల కోసమే కేటాయించి, గ్రామ స్థాయి వరకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షల శిక్షణ, స్కిల్ కోర్సులను అందుబాటులోకి తెచ్చి విద్యా విప్లవం సృష్టిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు తమ కలలను ఎప్పుడూ పెద్దగా కనాలని, ఎదురయ్యే ఓటములకు కృంగిపోకుండా అబ్దుల్ కలాం లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సారథి, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)