సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆత్మహత్యకు పాల్పడకుండా వ్యక్తిని రక్షించిన తిరుపతి పోలీసులు

1 రోజు క్రితం

Tirupati police save a person from committing suicide.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 02:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆత్మహత్యకు పాల్పడతానని వీడియో కాల్ చేసిన వ్యక్తిని సకాలంలో కాపాడిన తిరుపతి పోలీసులు

వేగంగా స్పందించి సాంకేతిక సహాయంతో వ్యక్తి ఆచూకీ గుర్తింపు.

ప్రాణాపాయ పరిస్థితికి ముందే వ్యక్తిని సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తరలింపు.

కౌన్సిలింగ్ ద్వారా ధైర్యం కల్పించి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగింత.

మానవత్వంతో స్పందించిన పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.


తిరుపతి : తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన సావిత్రి అనే మహిళ 25-09-2026 శుక్రవారం రోజున తిరుపతి పోలీస్ వాట్సాప్ నంబర్ 8099999977 కు సమాచారం అందిస్తూ ... తన భర్త చిన్న రాథోడ్ సంతోష్ గత మూడు రోజులుగా ఇంటి నుంచి వెళ్లిపోయి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడని తెలిపింది. అదే రోజు సంతోష్ తనకు వీడియో కాల్ చేసి, అప్పులు ఎక్కువగా ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, ఇక ఇంటికి తిరిగి రానని, తాను చనిపోతానని, ప్రస్తుతం తిరుపతిలో ఉన్నానని చెప్పినట్లు ఆమె పోలీసులకు వివరించింది. తన భర్తను ఎలాగైనా కాపాడాలని ఆమె తిరుపతి పోలీసులను వేడుకున్నారు.


అత్యంత సున్నితమైన అంశంగా గుర్తించిన తిరుపతి పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే సమాచారాన్ని తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు చేరవేశారు. సమాచారం అందిన వెంటనే వెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రామకృష్ణ స్పందించి, సాంకేతిక సహాయంతో సంతోష్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించే చర్యలు చేపట్టారు.


ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, ప్రత్యేక దృష్టి సారించి, వ్యక్తిని సురక్షితంగా గుర్తించి కాపాడేందుకు పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీసుల సమన్వయంతో సంతోష్ ఆచూకీని గుర్తించి, ఎటువంటి ప్రాణాపాయం జరగకముందే అతనిని సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.


పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన అనంతరం సంతోష్‌తో పోలీసులు ఆత్మీయంగా మాట్లాడి, అతని సమస్యలను తెలుసుకున్నారు. ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన అతనికి ధైర్యం కల్పిస్తూ, సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని వివరించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడించి, అతనికి అవసరమైన భరోసా కల్పించారు.


అనంతరం సంతోష్‌ను క్షేమంగా అతని భార్య సావిత్రికి అప్పగించారు. సకాలంలో స్పందించి తమ కుటుంబ సభ్యుడి ప్రాణాన్ని కాపాడిన తిరుపతి పోలీసులకు సావిత్రి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించి, పోలీసు సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేసి సకాలంలో చర్యలు తీసుకునేలా చేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు, ఐపీఎస్ కు కూడా కుటుంబ సభ్యులు కృతజ్క్షతలు తెలిపారు.


ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే స్పందించి, వ్యక్తి ఆచూకీని గుర్తించి, ప్రాణాపాయ పరిస్థితి నుంచి సురక్షితంగా కాపాడిన తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రామకృష్ణ, సంబంధిత పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ లను అభినందించారు.


ఆపదలో ఉన్న వ్యక్తిని కేవలం చట్టపరమైన బాధ్యతగా కాకుండా మానవత్వంతో స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడటం పోలీసు సేవలో అత్యంత ముఖ్యమైన బాధ్యత అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పోలీసులతో పంచుకోవాలని, ఎవరైనా తీవ్ర మనస్తాపంలో ఉన్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉన్నట్లు గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రతతో పాటు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్