ప్రజాశక్తి - తిరుపతి సిటీ : ‘భాస్కర్ రెడ్డిది అసాధారణ వ్యక్తిత్వమని, కమ్యూనిస్టులు సైతం నేర్చుకోవాల్సిన అరుదైన అంశాలు ఆయనలో ఉన్నాయి` అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రైతు సంఘం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.హేమలత భర్త పిఎన్ భాస్కర్ రెడ్డి ఈనెల 13న గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో బుధవారం సంస్మరణ సభ జరిగింది. తొలుత భాస్కర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సభకు పెద్ద అల్లుడు ఎస్. జయచంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి వి.శ్రీనివాసరావు, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, పూతలపట్టు శాసనసభ్యులు పి.మురళీ మోహన్, కాంగ్రెస్ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మూలం రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పి.ఎన్. భాస్కర్ రెడ్డి సిపిఎం పార్టీలో లేకపోయినా.. ఆయన ఇల్లు ఒక పార్టీ కార్యాలయంలా మారి ముగ్గురు హోల్ టైమర్లు పార్టీలో ఉన్నారంటే అది భాస్కర్‌రెడ్డి గొప్పతనమన్నారు. ఇద్దరూ కూతుళ్లే పుట్టినా ఏమాత్రం ఆలోచించకుండా ఆ రోజుల్లోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని, వారిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దారన్నారు. భార్యను సైతం ప్రోత్సహించి డిగ్రీ చదివించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. పెద్ద కుమార్తె, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సాయిలక్ష్మి మాట్లాడుతూ... తన తండ్రి అభ్యుదయవాది కాకపోయినా తన బిడ్డలను సంప్రదాయాలకు వ్యతిరేకంగా, కులాలకు అతీతంగా పెళ్లిళ్లు చేసేందుకు అంగీకరించారన్నారు. ప్రభాకర్ రెడ్డి, మురళీమోహన్ మాట్లాడుతూ... హేమలత రైతు ఉద్యమాల్లో, ఆమె పెద్ద కుమార్తె మహిళల కోసం, అల్లుడు జయచంద్ర కార్మికుల కోసం చురుగ్గా పనిచేయడం వెనుక.. భాస్కర్ రెడ్డి సహకారం ఎంతో ఉందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి, భాస్కర్ రెడ్డి చిన్న కుమార్తె సాయిదీప్తి, చిన్న అల్లుడు చక్రి, భాస్కర్ రెడ్డి భార్య పి.హేమలత, హేమలత తల్లి, మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు.
భాస్కర్ రెడ్డిది అసాధారణ వ్యక్తిత్వం : వి.శ్రీనివాసరావు
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)