సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసియాన్ దేశాలతో మారిటైం రంగంలో శాశ్వత భాగస్వామ్యాలు : మంత్రి లోకేష్

36 నిమిషాల క్రితం

Lasting partnerships with ASEAN nations in the maritime sector Minister Lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 04:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఎపి ని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్‌వేగా అభివృద్ధి చేస్తాం.. నాలుగు కొత్త పోర్టుల నిర్మాణం


ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : మారిటైం రంగంలో ఆగ్నేయాసియా (ఆసియాన్) దేశాలతో బలమైన, శాశ్వత భాగస్వామ్యాలను నిర్మించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్ర అనుసంధానం, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందన్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో ఇండియా ఫౌండేషన్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఏషియన్–ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో కేంద్ర సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 1,053 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రధాన మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు 91.17 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించిందని చెప్పారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, దుగరాజపట్నంలో రూ.30 వేల కోట్లతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదించామని వెల్లడించారు. ఇటీవల విశాఖలో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్ తదితర రంగాలకు సంబంధించి రూ.7,500 కోట్ల విలువైన ఐదు ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. విశాఖను అంతర్జాతీయ డిజిటల్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, ఏఐ హబ్, డేటా సెంటర్లు, సముద్రగర్భ కేబుళ్ల ఏర్పాటుకు గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. మూడు అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లు విశాఖలో ల్యాండ్ కానున్నాయని చెప్పారు. తర్లువాడలో సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని మరో సౌదీ అరేబియాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి, ఎగుమతులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏటా 70 వేల టన్నుల గ్రీన్ అమ్మోనియాను జపాన్‌కు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. మారిటైం రంగంలో యువతకు ఉపాధి కల్పించేలా 2028 నాటికి ఐదు వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆసియాన్ దేశాలతో సముద్ర అనుసంధానం, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలను విస్తరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీకి వచ్చి పోర్టులు, పరిశ్రమలను సందర్శించి పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని ఆయా దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామ్ మాధవ్, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, మాజీ నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠీ, వివిధ దేశాల రాయబారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్