గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నక్కపల్లిలో నైపుణ్య, సామాజిక అభివృద్ధి కేంద్రం

1 గంట క్రితం

Skill and Social Development Center in Nakkapalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 01:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నైపుణ్య, సామాజిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఆర్సెలర్‌మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా (ఏఎం/ఎన్‌ఎస్‌ ఇండియా) సంస్థలు ఉద్దేశపూర్వక లేఖపై సంతకాలు చేశాయి. ఈ కేంద్రం ద్వారా స్థానిక యువత, మహిళలు, రైతులు, మత్స్యకారులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి, జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు స్థానిక ప్రజలకు చేరేలా ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు. స్థానికుల ఆదాయాన్ని పెంచేందుకు, స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. కేంద్రంలో అర్హులైన యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ, గుర్తింపు పొందిన ధ్రువపత్రాలు, ఉద్యోగ నియామక సహాయం అందించనున్నారు. మత్స్య పరిశ్రమ, వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలతో పాటు మహిళల ఆధ్వర్యంలోని చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహించనున్నారు. ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేస్తూ స్థానిక కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఎం/ఎన్‌ఎస్‌ ఇండియా డైరెక్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ (హెచ్‌ఆర్‌, అడ్మినిస్ట్రేషన్‌) ఆశుతోష్‌ టెలాంగ్‌ మాట్లాడుతూ, ఏపీఎస్‌ఎస్‌డీసీ భాగస్వామ్యంతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌, స్థానిక అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవగాహన లేఖపై ఏపీఎస్‌ఎస్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో జి. గణేష్‌ కుమార్‌, ఐఏఎస్‌, ఆశుతోష్‌ టెలాంగ్‌ సంతకాలు చేశారు. కేంద్రం ఏర్పాటు, అభివృద్ధి, అమలుకు సంబంధించిన తుది నిబంధనలు తదుపరి అవగాహన ఒప్పందం ద్వారా ఖరారు కానున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్