కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి, నిర్లక్ష్యానికి తావివ్వొద్దు - జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై సోమవారం సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .... కౌంటింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేయాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. చెల్లుబాటయ్యే, చెల్లుబాటు కాని ఓట్లను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లకు నిర్దేశిత నిబంధనల మేరకు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి కల్పించాలన్నారు. మేయర్/చైర్మన్, కార్పొరేటర్/కౌన్సిలర్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేయాలి. రెండు రకాల ఓట్ల లెక్కింపును సమాంతరంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా లెక్కింపు సాగేలా సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. కౌంటింగ్ హాలుకు బయటే ఆహారం, తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో రౌండ్లు, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను క్రమబద్ధంగా వేరు చేసి లెక్కింపునకు సిద్ధం చేయాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బందికి ముందస్తుగా పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలి. బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల నమోదు ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించరాదు. భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి అంశాన్ని ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫలితాల ప్రకటనకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల మునిసిపల్ కమిషనర్లు బాలస్వామి, ఎల్ రాజ్యలక్ష్మి, టి గోవింద రావు, ఆర్డిఓలు సుధా సాగర్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)