సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యర్థాలు.. తీవ్ర దుర్వాసన !

2 గంటల క్రితం

Unidentified waste in the forest area a strong foul odor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 04:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శవాలను కాల్చి యాసిడ్‌ పోశారా ?

జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి


ప్రజాశక్తి బైరెడ్డిపల్లి (చిత్తూరు) : బైరెడ్డిపల్లి మండలం రామాపురం క్రాస్‌ దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో వెలుగుచూసిన గుర్తుతెలియని వ్యర్థాల ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. అటవీ ప్రాంతం నుంచి తీవ్ర దుర్వాసన వెదజల్లుతుండటంతో స్థానికులు గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 15 రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ యూరియా సంచులను పడేసి, వాటిపై యాసిడ్‌ వంటి రసాయన పదార్థాలు పోసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ సంచుల్లో ఏమున్నాయి ? మృతదేహాలను కాల్చి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించారా ? లేక ప్రమాదకర రసాయనాలతో కూడిన కుళ్లిన వ్యర్థాలను అక్కడ పడేశారా? అన్న ప్రశ్నలు ప్రజల్లో నెలకొన్నాయి. ఈ ఘటన వెనుక అసలు వాస్తవాలు ఏమిటన్నది అధికారుల సమగ్ర విచారణలోనే తేలాల్సి ఉంది. కేవలం ప్రాథమిక పరిశీలనతో సరిపెట్టకుండా, అక్కడ లభించిన పదార్థాలను శాస్త్రీయంగా పరీక్షించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి. ఈ ఘటనను సాధారణంగా తీసుకోకుండా జిల్లా పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖల ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే ఫోరెన్సిక్‌ నిపుణులతో పరీక్షలు నిర్వహించి, అక్కడ పడేసిన పదార్థాల స్వరూపాన్ని నిర్ధారించాలి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆధారాలు సేకరించి, ఈ వ్యర్థాలను అక్కడ పడేసిన వ్యక్తులు ఎవరన్నది గుర్తించాలి. అటవీ ప్రాంతాన్ని అక్రమ వ్యర్థాల డంపింగ్‌ కేంద్రంగా మార్చితే పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఒకవేళ నేరానికి సంబంధించిన ఆధారాలు ఉంటే అవి నాశనం కాకముందే భద్రపరచి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారులు నేరుగా రంగంలోకి దిగి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.
011

022


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్