అధికారిక ప్రచారానికి చివరి రోజు కావడంతో ఊపందుకున్న ప్రచారం
ప్రజాశక్తి - గజపతినగరం (విజయనగరం) : స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమవుతున్న వేళ ... మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా, టీ షాపులు, హోటళ్లు, డాబాల వద్ద ఎన్నికల ఫలితాలు, రాజకీయ సమీకరణాలపైనే ఉత్కంఠభరితమైన చర్చలు సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ఇప్పుడు ఓటర్లతో పాటు రాజకీయ విశ్లేషకులను సైతం తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. అదేనండి...తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరున్న గజపతినగరంలో, కూటమి పొత్తుల భాగంగా జడ్పిటిసి స్థానాన్ని నామినేషన్ చివరి రోజున సాయంత్రం అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) కేటాయించడం తీవ్ర సంచలనం సృష్టించింది. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఈ మండలంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన మహిళ, బీజేపీ నేత రెడ్డి పావనికి జడ్పిటిసి టికెట్ కేటాయించడంపై సాధారణ ఓటర్లు చర్చించుకుంటున్నారు. టీడీపీలోని పలువురు సీనియర్ నాయకులను, ఆశావహులను కాదని ఈ నిర్ణయం తీసుకోవడంతో కూటమి శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చర్చ నడుస్తోంది. అయితే పావనికి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఏ మేరకు సహకరిస్తారనేది ఇప్పుడు కూటమి పెద్దల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఎంపీటీసీ అభ్యర్థులకు సైకిల్ గుర్తు, జడ్పిటిసి అభ్యర్థికి కమలం గుర్తు ఉండటంతో ఓటర్లు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా ఆ మేరకు విస్తృత ప్రచారంలో భాగంగా కూటమి అభిమానులకు, కార్యకర్తలకు ఓటింగ్ వేసే విషయంలో ఏ మేరకు సంతృప్తిని అలాగే అవగాహన కల్పించారనేదే ఫలితాలు నాడే తెలుస్తుంది. ఈ పరిణామాలు ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) ఊపిరిపోసినట్లైంది. వైసీపీ తరఫున జడ్పిటిసి అభ్యర్థిగా మండల సూర్యకళ బరిలో నిలవగా, ఆమె భర్త మండల సురేష్ గతంలో పురిటిపెంట మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా, పార్టీ కీలక నేతగా సేవలందించిన అనుభవం ఉంది. అంతేకాకుండా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో, మండల వ్యాప్తంగా ఉన్న ఆ సామాజిక వర్గ ఓటర్లు పార్టీలకు అతీతంగా ఫ్యాన్ గుర్తుకు మద్దతు తెలుపుతారా లేదా అనే అంశంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.ఇదిలా ఉండగా, నేటి సాయంత్రం 5 గంటలతో అధికారిక ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ప్రత్యక్ష ప్రచారానికి స్వస్తి పలికి. అనధికార ప్రచారంలో భాగంగా ఆ ఏ గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తమ కుటుంబ, బంధుత్వ రాజకీయాలను కలిసొచ్చే విధంగా ఏ మేరకు ప్రయత్నం చేస్తారో వేచి చూడాలి. ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులు విస్తృతంగా ఆటోలు, కరపత్రాలతో ప్రచారం నిర్వహించడమే కాకుండా, పెద్ద ఎత్తున మద్యం, నగదు పంపిణీకి తెరలేపినట్లు టీ షాపుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఇదే నాకు చివరి అవకాశం, ఈ ఒక్కసారికి గెలిపించండి' అంటూ కొందరు అభ్యర్థులు ఓటర్ల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్న దృశ్యాలు మండలంలో కనిపిస్తున్నాయి. గత ఎన్నికల కంటే ఈసారి ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ, ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు శ్రమిస్తున్నారు. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే పోలింగ్ ముగిసి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే...








కామెంట్లు (0)