సమస్యలపై రూపొందించిన ఐక్య కార్యాచరణ
సామాజిక శంఖారావం రౌండ్ టేబుల్ సమావేశంలో కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు
ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : దళితులపై నేటికీ కులవివక్ష కొనసాగుతుందని దళిత సమస్యలపై ఐక్య కార్యాచరణ చేపట్టనున్నట్లు సామాజిక శంఖారావం రౌండ్ టేబుల్ సమావేశంలో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు స్పష్టం చేశారు. స్థానిక వెంటే వారి తోటలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు మాట్లాడుతూ జిల్లాలో దళితులు ఎదుర్కొనే సమస్యలపై కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు సంయుక్తంగా సామాజిక శంఖారావం చేపట్టినట్లు తెలిపారు. దళితులు ఎదుర్కొనే కుల వివక్ష, అంటరానితనం వంటి రూపాలు, దళిత కాలనీల్లో ఉన్న సమస్యలు, దళిత ప్రజల జీవనోపాధి వంటి సమస్యలపై అధ్యయనం చేసి ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 12,13వ తేదీలలో జిల్లాలో అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో దళిత సమస్యలపై ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. 79ఏళ్ల స్వాతంత్ర్యంలో దళితులపై నేటికీ కులవివక్ష కొనసాగుతుందని తెలిపారు. ఇల్లు అద్దెకు ఇవ్వడంలో కూడా కులమే అడ్డు వస్తుందన్నారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించి దళిత పేటల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైట్లు వంటి అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిపేశారని మండిపడ్డారు. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ దళితులపై దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఈద శేఖర్ బాబు మాట్లాడుతూ దళిత సమస్యలపై ఐక్య ఉద్యమాలే శరణ్యమన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లిపూడి ఆంజనేయులు మాట్లాడుతూ సమాజంలో శ్రామికులను కులాలవారిగా విడదీసి కార్మిక హక్కులపై పోరాడకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో దళిత విద్యార్థులు ఉండే ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ సమస్యలపై పోరాడుతున్నామని, దళిత, ప్రజా సంఘాలు కూడా విద్యార్థుల సమస్యలపై ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్ ఎం.వైకుంఠరావు మాట్లాడుతూ గ్రామాల్లోనే కాకుండా పట్టణంలో కూడా దళిత పేటల అభివృద్ధి కుంటుపడిపోయాయన్నారు. భీమవరం 2వ వార్డులో దళితులకు కట్టిన అపార్ట్మెంటు వద్ద కనీస వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు సంఘం జిల్లా నాయకులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు, వేండ్ర సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శేషపు అశ్రియ్య పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)