ఒక అర లీటర్ నీళ్ల బాటిల్ చూడడానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ అదే పరిమాణంలో నీరు ఎక్కడో ఒక డేటాసెంటర్‌లో మనం అడిగిన ఎఐ ప్రశ్నలకు ఖర్చవుతోందని చాలా మందికి తెలియదు. ఎఐ స్క్రీన్‌పై కనిపించే సమాధానం వెనుక విద్యుత్ మాత్రమే కాదు. నీరు కూడా ఉంది. డేటా సెంటర్లలో సర్వర్లను చల్లబరచడానికి, విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి, ఎఐ చిప్‌లను తయారు చేయడానికి నీరు అవసరం. ఎఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ నీటి వినియోగం కూడా పెద్దదవుతుంది. గతంలో వచ్చిన ఎన్నో నివేదికలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాయి.
‘ఒక్క ఎఐ ప్రశ్నకు ఎంత నీరు?’ అన్నదానికి ఇప్పటివరకు కచ్చితమైన సమాధానం లేదు. అయితే మనం వినియోగించే ఎఐ మోడల్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఆ మోడల్‌ను ఆపరేట్ చేసే డేటాసెంటర్, కూలింగ్ పద్ధతి, అది ఇచ్చిన సమాధానం పొడవును బట్టి నీటి వినియోగం మారుతుంది. ఒక అధ్యయనం జిపిటి-3 ఆధారంగా 10–50 మధ్యస్థ సమాధానాలకు 500 మిల్లీ లీటర్ల నీటి వినియోగాన్ని అంచనా వేసింది. గూగుల్ తన జెమిని ఎఐకి చేసిన తాజా పరిశోధనలో ఒక్క టెక్స్ట్ ప్రాంప్ట్‌కు 0.26 మిల్లీ లీటర్లు అని చెప్పింది.
ఇప్పుడు ఎఐలో ప్రశ్నలు–సమాధానాలు మాత్రమే కాదు. బొమ్మలు అడగడం, వీడియోలు చేయడం కూడా సర్వసాధారణం అయిపోయింది. సమాధానాలతో పోలిస్తే బొమ్మలకు ఎక్కువ కంప్యూటింగ్ అవసరం. అంటే నీటి వినియోగం కూడా పెరుగుతుంది. అయితే ఒక్కో చిత్రానికి ఎంత నీటి వినియోగం అనేది కూడా ఎఐ మోడల్–డేటాసెంటర్ ఆధారంగా మారుతుంది.
మన దేశంలో ఎఐ డేటా సెంటర్ల విస్తరణ వేగంగా జరిగిపోతోంది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సిఇఇడబ్ల్యు) ప్రకారం 2025 ఏప్రిల్ నాటికి భారతదేశంలో డేటా సెంటర్ల ఐటి లోడ్ సుమారు 1.4 గిగావాట్. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, ప్రణాళికలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా 2030 నాటికి 6.5 గిగావాట్ల నుంచి 17 గిగావాట్లకు పెరగవచ్చని అంచనా వేశారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. దేశంలోని ప్రధాన డేటా సెంటర్లు నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న వేడి కారణంగా డేటా సెంటర్లను కూలింగ్ చేయడానికి వినియోగించాల్సిన నీటి ఖర్చు కూడా పెరుగుతుంది. సిఇఇడబ్ల్యు అంచనా ప్రకారం దేశంలో ఉన్న మొత్తం డేటా సెంటర్లు అంటే ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజ్, ఇతర డిజిటల్ వర్క్‌లోడ్స్‌కు ఏడాదికి 15 వేల కోట్ల లీటర్ల నీరు ఖర్చవుతోంది.
ఈ మధ్య కాలంలో ఎఐలో కొన్ని ట్రెండ్స్ బాగా వినిపించాయి. మొన్నామధ్య గిబ్లీ ఆర్ట్, ఇటీవల 80స్ ట్రెండ్ ఈ కోవలోనివే. ఒకేసారి కొన్ని కోట్ల మంది ఎఐ ద్వారా ఈ చిత్రాలను రూపొందించారు. అంటే ఈ నిమిత్తం ఎంత నీరు ఖర్చు అయిందో ఊహించుకోవచ్చు. ఒక పరిశోధన ప్రకారం ఒక్క చిత్రానికి 29 మిల్లీ లీటర్ల నీరు వినియోగపడుతుందని అనుకుంటే.. అది చాలా చిన్న పరిమాణంలో కనిపిస్తుంది. కానీ ఒకేసారి కోట్లాది చిత్రాలు తయారైతే ఆ లెక్క చాలా పెద్దది.
విశాఖలో ప్రస్తుతం నెలకొన్న నీటి కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి సమయంలోనే అక్కడ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. దీనిపై మేధావులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ పత్రిక రాయిటర్స్ ఆగస్టు 2026లో ఇచ్చిన ఓ నివేదిక ప్రకారం... విశాఖ నగరానికి రోజుకు 48 కోట్ల లీటర్ల నీరు అవసరం అవుతుంది. రిజర్వాయర్లు, నదుల నుంచి సుమారు 41 కోట్ల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. అంటే రోజుకు 7 కోట్ల లీటర్ల నీటి కొరత ఉంది. విశాఖలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్‌ను మొదట ఒక గిగావాట్ సామర్థ్యంతో ప్రకటించారు. ఆ తర్వాత ప్రాజెక్టు సామర్థ్యం 2.5 గిగావాట్లకు పెరిగిందని ఇండియా టుడే పత్రిక ఉటంకించింది. ముఖ్యంగా తర్లువాడ, అడవివరం, ముడసర్లొవ, రాంబిల్లిలో 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ప్రాజెక్టు ప్రణాళిక ఉంది. మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఇఎఎస్ శర్మ ‘ఫైనాన్షియల్ టైమ్స్’లో రాసిన లేఖలో 1–1.5 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ రోజుకు 12 కోట్ల నుంచి 18 కోట్ల లీటర్లను వినియోగిస్తుందని పేర్కొన్నారు. ఈ గణాంకాలను బట్టి భవిష్యత్తులో విశాఖలో నీటి ఎద్దడి మరింత తీవ్రమవుతుందని అర్థమవుతోంది.
సాంకేతికతను అందిపుచ్చుకుని, నైపుణ్యాన్ని అలవర్చుకున్న సమాజం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందనేది నిజం. అయితే.. పర్యావరణాన్ని పణంగా పెట్టి సాధించిన అభివృద్ధి సమాజానికి శ్రేయస్కరం కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే.. మన కళ్లముందే వేల కోట్ల లీటర్ల నీళ్లు ఆవిరైపోతున్నాయి. సాంకేతికత అందరికీ కావాలి.. అదే సమయంలో అనవసర విషయాలకు పదే పదే వినియోగించడం మానుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం తాగుతున్న నీళ్లు భవిష్యత్తు తరాలకు కూడా కావాలి.







కామెంట్‌లు (0)