టైప్-2 డయాబెటిస్ చికిత్సలో దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న మందు మెట్‌ఫార్మిన్. రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఇది ఎలా పనిచేస్తుందన్న ప్రశ్నకు ఇప్పటివరకు ప్రధానంగా ఒకే సమాధానం ఉండేది. కాలేయం అదనంగా గ్లూకోజ్‌ను తయారు చేయకుండా మెట్‌ఫార్మిన్ అడ్డుకుంటుందని భావించేవారు. అయితే కొత్త పరిశోధనలు ఈ మందు పనిచేసే విధానంలో పేగుల పాత్ర కూడా ముఖ్యమేనని చెబుతున్నాయి. నేచర్ మెటబాలిజంలో 2026లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, మెట్‌ఫార్మిన్ పేగుల కణాల్లోని మైటోకాండ్రియల్ కాంప్లెక్స్-1 అనే శక్తి ఉత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా పేగు కణాలు రక్తంలోని గ్లూకోజ్‌ను ఎక్కువగా తీసుకుని వినియోగించే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే రక్తంలో ఉన్న అదనపు చక్కెరకు పేగులు ఒక రకమైన ‘సింక్’లా పనిచేస్తాయన్నమాట.
మన చిన్నపేగులోని కణాలు సాధారణంగా ఆహారం నుంచి వచ్చే గ్లూకోజ్‌ను గ్రహించి రక్తంలోకి పంపుతాయి. అయితే మెట్‌ఫార్మిన్ ప్రభావంతో ఈ కణాల శక్తి వినియోగ విధానం మారుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌లో కొంత భాగాన్ని పేగు కణాలు తమ జీవక్రియ కోసం ఉపయోగించుకుంటాయి. దాంతో రక్తంలో చక్కెర స్థాయి తగ్గేందుకు సహాయపడుతుంది. గ్లూకోజ్ వినియోగం పెరగడంతో లాక్టేట్ వంటి జీవక్రియ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి. అంతేకాదు, మెట్‌ఫార్మిన్ పేగుల్లో ఆహారం నుంచి గ్లూకోజ్ శోషణను కూడా ప్రభావితం చేయవచ్చు. గ్లూకోజ్‌ను పేగుల నుంచి రక్తంలోకి తరలించే కొన్ని రవాణా ప్రోటీన్ల పనితీరులో మార్పులు తీసుకురావడం ద్వారా రక్తంలోకి చక్కెర వేగంగా చేరకుండా చేయవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. మెట్‌ఫార్మిన్‌కు పేగు హార్మోన్లతోనూ సంబంధం ఉంది. ముఖ్యంగా జీఎల్‌పీ-1 అనే హార్మోన్ ఇన్సులిన్ విడుదలను పెంచి రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడుతుంది. మెట్‌ఫార్మిన్ పేగుల్లో జీఎల్‌పీ-1 విడుదలను ప్రభావితం చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పేగుల్లో నివసించే సూక్ష్మజీవులపై కూడా మెట్‌ఫార్మిన్ ప్రభావం చూపుతుంది. మందు వాడుతున్నవారిలో గట్ మైక్రోబయోమ్‌లో మార్పులు కనిపించాయి. అయితే ఈ మార్పులే మెట్‌ఫార్మిన్ రక్తచక్కెరను తగ్గించడానికి ప్రధాన కారణమా, లేక మందు పనిచేసిన తర్వాత ఏర్పడే మార్పులా అన్నది ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ఇదే సమయంలో మెట్‌ఫార్మిన్ తీసుకున్నప్పుడు కొందరికి కడుపు ఉబ్బరం, వికారం, విరేచనాలు వంటి సమస్యలు ఎందుకు వస్తాయన్నదానికీ పేగుల పాత్ర కొంత సమాధానం ఇవ్వవచ్చు. పేగుల్లో మందు ఎక్కువగా ఉండటం, అక్కడి జీవక్రియను మార్చడం దీనికి ఒక కారణం కావచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. తాజా పరిశోధనలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి: డయాబెటిస్ నియంత్రణలో పేగులు ఆహారం జీర్ణం చేసే అవయవాలు మాత్రమే కావు. రక్తంలో చక్కెర నియంత్రణలోనూ అవి చురుకైన పాత్ర పోషిస్తాయి.







కామెంట్‌లు (0)