సమీక్షా సమావేశంలో కన్నీటిపర్యంతమైన అభ్యర్థి
నేతల వల్లే ఓటమి అంటూ పెట్రోల్ డబ్బాలతో అనుచరుల హల్‌చల్
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలోని వెంకట్రామన్నగూడెం ఎంపిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపిపి పరిమి రవికుమార్ ఓటమి చెందడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపింది. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అభ్యర్థి ఆవేదనను చూసి ఇద్దరు అనుచరులు పెట్రోల్ డబ్బాలు చేతపట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ హల్‌చల్ చేయడంతో ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాడేపల్లిగూడెం ఎంపిపి అభ్యర్థిగా టిడిపి నుంచి మాజీ ఎంపిపి పరిమి రవికుమార్‌ను ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. ఆయన వెంకట్రామన్నగూడెం ఎంపిటిసి స్థానం నుంచి బరిలోకి దిగారు. శనివారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో వైసిపి అభ్యర్థి పత్స రామచంద్రయ్య నాలుగు ఓట్ల ఆధిక్యతతో రవికుమార్‌పై గెలుపొందారు. దీనిపై రీకౌంటింగ్ చేపట్టినా మళ్లీ అదే ఫలితం వచ్చింది. శనివారం అర్ధరాత్రి తర్వాత రామచంద్రయ్య గెలిచినట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు. సోమవారం తాడేపల్లిగూడెంలోని గొర్రెల శ్రీధర్ కల్యాణ మండపంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల బాబ్జీ అధ్యక్షత వహించారు. తనకు అన్యాయం జరిగిందంటూ రవికుమార్ కన్నీటిపర్యంతమయ్యారు. అదే సమయంలో ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్‌చల్ చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిశీలకులుగా వచ్చిన టిడిపి సీనియర్ నేత ముళ్లపూడి బాపిరాజు, ఇతర నాయకులు సర్దిచెప్పి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి సమావేశాన్ని ముగించారు.







కామెంట్‌లు (0)