720 ఉద్యోగాలు.. దరఖాస్తులకు డిసెంబర్ 11 చివరి తేదీ!
ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 720 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 249 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, అభ్యర్థులు డిసెంబర్ 11వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. https://portal-psc.ap.gov.in/GROUPII_2026/
పోస్టుల వివరాలు ఇవే..
మొత్తం 720 ఖాళీల్లో ఎగ్జిక్యూటివ్ విభాగంలో 471 పోస్టులు, నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో 249 పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ విభాగంలో అత్యధికంగా 203 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, 176 డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్ (GST) 40 పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ 29 పోస్టులను భర్తీ చేయనున్నారు.
నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) 80 పోస్టులు, సీనియర్ అకౌంటెంట్ 91 పోస్టులు సహా ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నేటి నుంచి
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 11
స్క్రీనింగ్ టెస్ట్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 21
మెయిన్స్ పరీక్ష తేదీలు: త్వరలో ప్రకటించనున్నారు
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పూర్తి నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.








కామెంట్‌లు (0)