వాట్సాప్ సహా పలు సంస్థలను కోరిన సుప్రీం
న్యూఢిల్లీ : డిజిటల్ అరెస్టు కుంభకోణాలు, సైబర్ నేరాలను నివారించేందుకు చేపట్టతలచిన చర్యల గురించి తెలియచేయాలంటూ వాట్సాప్, ఇతర మధ్యవర్తి వేదికలను సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది. సుప్రీం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేరాల బాధితులకు సంబంధించిన సుమోటో కేసు, సంబంధిత అంశాలను విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. వారు తమ ప్రతిపాదనలను అదే సమయంలో 14సికి కూడా సమర్పించాలని పేర్కొంది. 14సి అంటే ఇండియన్ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం. ఈ అంశంపై తదుపరి విచారణను నవంబరు 23కి వాయిదా వేసింది.
అనేక మాసాలుగా ఈ బెంచ్ ఈ అంశాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం ఆదేశాలు వెలువడిన తర్వాత తీసుకున్న చర్యలను వివరిస్తూ కేంద్రం స్టేటస్ నివేదిక దాఖలు చేసింది. డిజిటల్ అరెస్టు కుంభకోణాలు, శాంతి భద్రతల అధికారుల ముసుగులో వచ్చిన వారికి సంబంధించిన 9400 ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. ఈ ఏడాది ఆగస్టులో బెంచ్ పలు ఆదేశాలు వెలువరించింది. తగినంత శ్రద్ధతో వ్యవహరించడంలో విఫలమవడం వల్లనే ఈ అవినీతి, మోసాలు చోటు చేసుకున్నాయని దర్యాప్తుల్లో తేలినట్లైతే సైబర్ మోసాల బాధితులకు బ్యాంకులు నష్టపరిహారాలను అందచేయాలని పునరుద్ఘాటించింది. పలు రక్షణ చర్యలను రూపొందించాల్సిందిగా ఆర్‌బిఐని కోరింది. అనుమానాస్పద లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయడం, పోలీసులను అప్రమత్తం చేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరింది. తదుపరి విచారణా తేదీ అయిన నవంబరు 23లోగా అధీకృత ఆర్థిక సంస్థల జాబితాను అందచేయాలని ఆర్‌బిఐని కోరింది.







కామెంట్‌లు (0)