హైదరాబాద్ : ‘నీట్’ వ్యవహారంపై జెన్ జడ్ పోరాటానికి సెల్యూట్ అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. నీట్, ఇతర పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేపట్టిన నిరసనకు మద్దతుగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో విద్యార్థులు నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నిరసనలకు మద్దతు ప్రకటిస్తున్నాయి. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలపై స్పందిస్తున్నారు. విద్యార్థుల నిరసనలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా విద్యార్థుల నిరసనపై స్పందించారు. ‘నీట్’ వ్యవహారంపై జెన్ జడ్ పోరాటానికి సెల్యూట్ అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 'విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు పరిహారం అనేది అడక్కుండా చేయాల్సిన పనులు. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోవడానికి లక్షల మంది లాఠీ దెబ్బలు తింటున్నారు. వారి పోరాటంలో న్యాయముంది. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు.` అని అన్నారు. మరోవైపు ... 'ఈ ప్రొటెస్ట్ ఒక విప్లవం` అని నాగ్ అశ్విన్ అన్నారు.
అప్పటివరకు జంతర్ మంతర్ నుంచి కదిలేది లేదు : సిజెపి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు తమ నిరసన కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప తమకు మరేది ఆమోదయోగ్యం కాదని అన్నారు. అప్పటివరకు నిరసనను విరమించే ప్రసక్తే లేదని అన్నారు. ‘‘ఈ నిరసన దేశ యువతకు చెందినది, ఇది కేవలం సోనమ్ వాంగ్‌చుక్ లేదా దీప్కేలకు మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రతిపక్ష పార్టీలది కాదు, దేశ యువతది. ప్రభుత్వం ఈ నిరసనకు పరిష్కారం కోరుకుంటే... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే దానికి ఏకైక మార్గం’’ అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్రం తీరుపై అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం సోనమ్ వాంగ్‌చుక్‌ను నిర్బంధంలో ఉంచిందని నేను భావిస్తున్నాను. జేపీ నడ్డా ఆయనను కలవగలిగారు, కానీ ఏ ప్రతిపక్ష ఎంపీలూ ఆయనను కలవలేకపోయారు. చివరికి మేము కూడా ఆయనను కలవలేకపోయాము. అయితే సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’ ఆయన అన్నారు.







కామెంట్‌లు (0)