దేశం, ప్రపంచం ఏమైనా సరే, తమ స్థానిక రాజకీయాలే కీలకం అంటాయి అనేక ప్రాంతీయ పార్టీలు. ఎ.పి, తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ ఎక్కడైనా సరే ఈ లక్షణం వల్ల కలుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు చూడండి.. బొద్దింకల యుద్ధంతో ఢిల్లీ హోరెత్తిపోతున్నది. పార్లమెంటు ప్రకంపనలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయి. కానీ ఈ పార్టీల సంగతి వేరు. తెలంగాణలో బిఆర్‌ఎస్ అధికార కాంగ్రెస్‌పైనే ఫోకస్. రాహుల్‌గాంధీ ద్వంద్వనీతి అంటూ హెడ్డింగులు పెడుతుంది వారి మీడియా. అంతేగాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బిజెపితో చేతులు కలిపారు గనకే రాహుల్ గాంధీకి మద్దతుగా ఢిల్లీ వెళ్లలేదని ఆరోపిస్తుంది. బుధవారం తన సొంత నియోజకవర్గంలో నిరసన ర్యాలీ జరిపి రేవంత్ ఒక విధంగా ఈ విమర్శకు సమాధానమిచ్చారు. తర్వాత పోటాపోటీ దాడులు జరిపారు. మరోవైపున కెటిఆర్ నిరుద్యోగ ర్యాలీలలోనే మాట్లాడుతున్నారు. ఇక ఎ.పి లో వైసిపి కూడా కూటమి నిర్బంధం అణచివేతలపై మాట్లాడ్డం తప్ప ఢిల్లీ పరిణామాలపై పెద్దగా మాట్లాడరు. ఇప్పుడు జగన్, మోడీకి మద్దతు తెలిపేందుకై ఢిల్లీకి వెళతారని స్టోరీలు నడుస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ అయితే కాంగ్రెస్ బిజెపిల కుమ్మక్కు ఫలితమే ఇదంతా అని ఆరోపిస్తుంది. రాహుల్ రాగానే కేంద్రం స్పందించిందని వారి వాదన. ఒరిస్సా మాజీ సిఎం నవీన్ పట్నాయక్ కూడా యువతకు మద్దతు తెల్పితే, వారిని కలిసిన ఎన్‌సిపి నేత శరద్ పవార్ నేరుగా మోడీ దగ్గరకు వెళ్లి సంచలనం కలిగించారు. రాహుల్ గాంధీ ఈ సందర్భాన్ని హైజాక్ చేశారనే మాట కూడా మీడియాలో చాలా మంది వినిపించారు. దానిపై కాంగ్రెస్ కొంత సంజాయిషీ కూడా ఇచ్చింది. బెంగాల్ మాజీ సిఎం మమతా దీది అవసరమైతే తానూ వెళ్లి దీక్షలో కూచుంటానని గొప్పగా ప్రకటించారు. నిజానికి అందరికన్నా ముందునుంచి విద్యార్థులకు మద్దతు తెల్పుతున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి బేబీ వంటి వారు వ్యవహరించిన తీరు ఇందుకు భిన్నం. ఇక ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొని వచ్చిన ప్రకాశ్‌రాజ్ వంటి వారు పార్టీలకు అతీతంగా యువత నడిచి వచ్చిందని అభినందిస్తున్నారు. షబానా అజ్మీ, జావేద్ అక్తర్, సల్మాన్ ఖాన్ వంటి వారు కూడా సంఘీభావం ప్రకటించారు. ఆయా పాలక పార్టీలు వాటి వాటి వ్యూహాలను అమలు చేసి ప్రయోజనం పొందాలనుకోవడం తప్పు లేదు గానీ సమయం సందర్భం లేకుండా పిడుక్కీ బియ్యానికి ఒకటే మంత్రమన్నట్టు వ్యవహరిస్తే ఎలా?
భజన రంగ సోషల్ దళ్
మనకు ఆర్.ఎస్.ఎస్ మానస పుత్రికలైన విహెచ్‌పి, బజరంగదళ్ వంటి వాటి గురించి బాగా తెలుసు. నిజానికి ఇప్పుడు బొద్దింకల ఆందోళనకు కేంద్ర నినాదంగా వున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో విహెచ్‌పి అధ్యక్షుడిగా వున్నవారే. ఆయనను అంతగా పట్టుకువేళ్లాడ్డానికి అదీ ఒక కారణం. సరే, ఆ దళ్ సంగతి అలా వుంచితే ఇప్పుడు ఈ భజనరంగ దళ్ అంతకు మించి రెచ్చిపోతున్నది. మీడియాలో వామపక్ష భావాలు ఎక్కువ గనక తమకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారని మోడీ దగ్గరనుంచి గగ్గోలు పెడుతుంటారు. వాస్తవానికి ఆయన అధికారంలోకి రావడానికి సాధనంగా చేసుకున్నది కూడా సోషల్ మీడియా వేదికలనే కదా! ఇప్పుడు కూడా సనాతన పేరుతో, హిందూ ధర్మం పేరుతో ఈ వేదికలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇష్టానుసారం రాయిస్తు, చెప్పిస్తూ రెచ్చగొడుతున్నారు. మత వ్యతిరేకత మార్క్సిస్టు వ్యతిరేకత మేళవించిన ఈ భజన బ్యాచి ఎ.పి, తెలంగాణలో అటూ ఇటూ ప్రాంతీయ వాదనలను కూడా చిచ్చుపెడుతున్నారు. రాసిచ్చింది చదవడమే గనక కనీస పరిజ్ఞానం కూడా వుండటం లేదు. ఇప్పుడు బొద్దింకల తిరుగుబాటును కూడా చైనాకు ఆపాదిస్తున్నారు. మరీ విపరీతమేమంటే ఇద్దరు లేడీ యూట్యూబర్లు కేంద్రమంత్రి బండి కుమారుడి పోక్సో కేసును కూడా భుజాన వేసుకుని ఆ బాధితురాలిపైనే నిందలు మోపారు. కొత్తగా జనసేన నుంచి రాజ్యసభకు ఎన్నికైన లింగమనేని రమేష్, బండిని కలిసి కృతజ్ఞతలు చెప్పినప్పుడు సోషల్ మీడియాలో సనాతనంపై జరుగుతున్నదాడిని ఉక్కుపాదంతో అణచివేయాలని సందేశమిచ్చారట. బాగుంది కదా!
- పీపీ







కామెంట్‌లు (0)