న్యూఢిల్లీ : ధార్‌లోని వివాదాస్పదభోజ్‌శాల సముదాయానికి సంబంధించి ముస్లింవర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోజ్‌శాలకు దూరంగా నమాజ్ కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జులై 29న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. భోజ్‌శాల సముదాయానికి ఆనుకుని లేదా సమీపంలో నమాజ్‌ల కోసం స్థలం కేటాయించాలని ముస్లిం వర్గం కోరుతోంది.
జులై 22న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు జాబితా చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఆ రోజు కాజ్‌లిస్ట్‌లో ఈ కేసు లేకపోవడంతో విచారణ ముగిసే దశలో సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మది ధర్మాసనం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. ప్రభుత్వ అధికారులు భోజ్‌శాలకు ఆనుకుని లేదా సమీపంలో నమాజ్ కోసం స్థలం కేటాయించాలని, ఇప్పటికే వరుసగా రెండు శుక్రవారాలు నమాజ్ నిర్వహించలేకపోయామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన స్థలం రోడ్డు మార్గంలో 1.3 కి.మీ దూరంలో ఉందని అహ్మది వాదించారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ఆ స్థలం కేవలం 900 మీటర్ల దూరంలోనే ఉందని చెప్పారు. అయితే, "మా వద్ద హెలికాప్టర్లు లేవు. రోడ్డు మార్గంలో వెళ్తే అది 1.3 కి.మీ దూరంలో ఉంటుంది" అని అహ్మది బదులిచ్చారు. కోర్టు ఆదేశాల అమలును తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.







కామెంట్‌లు (0)