హైదరాబాద్ : 'విజయ్ అసెంబ్లీలో అదరగొడుతున్నారు` అని టాలీవుడ్ హీరో నాని అన్నారు. ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ 'ది ప్యారడైజ్' ప్రమోషన్స్‌లో నాని బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి, సినీనటుడు విజయ్ రాజకీయ ప్రయాణంపై స్పందించారు. 'ఇది కేవలం ఆయన స్టార్డమ్ లేదా బాక్సాఫీస్ విజయానికి సంబంధించిన విషయం కాదు. తమిళనాడు ప్రజలు విజయ్ పై ఎన్నో ఏళ్లుగా నమ్మకాన్ని పెంచుకున్నారు. ఆయన తమ కుటుంబంలో ఒకరిగా భావించే స్థాయిలో ఆ అనుబంధం ఉంది' అని నాని ప్రశంసించారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు లభిస్తున్న మద్దతును కేవలం సినీ అభిమానంగా చూడకూడదని, ప్రజలతో విజయ్ కు ఏర్పడిన అనుబంధమే ఆయన రాజకీయ ప్రయాణంలోనూ కనిపిస్తోందని నాని అభిప్రాయపడ్డారు. విజయ్ అసెంబ్లీ కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలను తాను సోషల్ మీడియాలో చూశానని నాని తెలిపారు. "నేను ఆన్‌లైన్‌లో చూసినంతవరకు విజయ్ అసెంబ్లీలో అదరగొడుతున్నారు" అని అన్నారు. రాబోయే రోజుల్లో విజయ్ పాలన బాగుండాలని, ఆయనపై నమ్మకంతో నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకున్నారు. అనంతరం ఇదే ప్రెస్ మీట్ లో పాన్ ఇండియా సినిమాలపై నాని స్పందిస్తూ ... తన సినిమాలను 'పాన్ ఇండియా సినిమాలు' అని పిలవడం తనకు పెద్దగా ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఒక హిందీ సినిమా ఇతర ప్రాంతాల్లో విజయం సాధించినప్పుడు దాన్ని సాధారణంగా హిందీ సినిమాగానే పిలుస్తారని, అదే సమయంలో దక్షిణాది సినిమా ఇతర భాషల్లో సక్సెస్ అయితే మాత్రం 'పాన్ ఇండియా' అనే లేబుల్ వేస్తారని నాని అన్నారు. ఈ విధానం తనకు నచ్చదని, అందుకే తన సినిమాలకు ఆ ట్యాగ్ పెట్టుకోవడం ఇష్టం లేదని వివరించారు. ఇక నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. 'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమాలో నాని జడల్ అనే పాత్రలో కనిపించనుండగా, రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 24, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
'విజయ్ అసెంబ్లీలో అదరగొడుతున్నారు` : నాని
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)