హైదరాబాద్ : భారతీయ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ‘బాహుబలి’ రూపకల్పన వెనుక జరిగిన ప్రయాణాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించారని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు చిత్ర బృందంలోని పలువురు కీలక సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు. మహిష్మతి సామ్రాజ్యం రూపకల్పన నుంచి భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ వరకు ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు ఇందులో ఆసక్తికరంగా చూపించారు.
ప్రభాస్ అంకితభావానికి ప్రశంసలు ...
సినిమా విజయంలో నటీనటులతో పాటు వందలాది మంది టెక్నీషియన్లు, స్టంట్ కళాకారులు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, సహాయక సిబ్బంది చేసిన కృషిని కూడా డాక్యుమెంటరీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ‘బాహుబలి’ కోసం తన కెరీర్‌లో ఎన్నో సంవత్సరాలు అంకితం చేసిన ప్రభాస్ నిబద్ధతపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు చేస్తున్నారు. చివరి ఎపిసోడ్ ఎంతో హృదయాన్ని హత్తుకునేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే రాజమౌళి విజన్‌ను విశ్వసించి అంత భారీ ప్రాజెక్టును నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డ ధైర్యసాహసాలను కూడా అభిమానులు కొనియాడుతున్నారు.
‘బాహుబలి 3’పై అధికారిక ప్రకటన
డాక్యుమెంటరీ ముగింపులో అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’లోని ప్రసిద్ధ డైలాగ్‌ను ప్రస్తావించిన రాజమౌళి.. ఈ కథ ఇంకా ముగియలేదని సంకేతమిచ్చారు. అనంతరం ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కలిసి ‘బాహుబలి 3’ అధికారికంగా తెరకెక్కనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత తెరపై ‘The Legacy Continues’ అనే సందేశం ప్రదర్శించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Baahubali3 హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
మళ్లీ మహిష్మతి ప్రపంచంలోకి...
2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో వచ్చిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపును తీసుకొచ్చిన ఈ ఫ్రాంచైజీ, ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. విజువల్ స్టోరీటెల్లింగ్‌కు కొత్త ప్రమాణాలను నెలకొల్పిన ఈ చిత్రాల ప్రయాణాన్ని ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ‘బాహుబలి 3’ అధికారిక ప్రకటనతో మహిష్మతి కథలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ‘వారణాసి’ సినిమా పూర్తైన అనంతరం రాజమౌళి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌పై దృష్టి సారిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.









కామెంట్‌లు (0)