mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లీడర్లు, ఛేంజ్‌ ‌మేకర్స్‌‌గా కావాలి​

1 గంట క్రితం

lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:05 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సింగపూర్ అధ్యయన యాత్ర టీచర్లతో మంత్రి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​ఉపాధ్యాయులు సమాజంలో మార్పునకు నాయకత్వం వహించే లీడర్లు అని, ఛేంజ్ మేకర్స్‌‌గా తయారు కావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. అందుకు అండగా తాము ఉంటామని ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన 37మంది ఉత్తమ ఉపాధ్యాయులతో ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం సమావేశమయ్యారు. ప్రభుత్వం టీచర్లను లీడర్లు భావిస్తోందని, కష్టపడి మంచి ఫలితాలు సాధించే వారికి ప్రత్యేక గుర్తింపునిస్తామని చెప్పారు. సింగపూర్ అధ్యయన యాత్రలో నేర్చుకున్న అంశాలను స్కూలు, క్లస్టర్, మండలాల్లో అమలు చేసేందుకు నాయకత్వం వహించాలని కోరారు. ప్రస్తుతం మనం మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టి, సాఫ్ట్ వేర్ మర్చిపోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో లీప్ మోడల్ విద్యావ్యవస్థ సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. టీచర్లు బోధనపైనే శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యావ్యవస్థలో ఆశించిన మార్పు తేవడం వెనువెంటనే సాధ్యం కాదని, కొంత సమయం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో మనం చేపట్టిన సంస్కరణల కారణంగా ఈ ఏడాది లక్షమందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారాడం శుభపరిణామం అని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు మించిన టీచర్లు ప్రైవేటు స్కూళ్లలో లేరని అన్నారు. ఆదర్శవంతమైన విద్యావ్యవస్థ సాధనకు మీ సహకారం కావాలని, కలిసికట్టుగా పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. లక్షలాదిమంది బిడ్డల భవిష్యత్తు తమపై ఆధారపడి ఉందని వెల్లడించారు. ​ దేశవ్యాప్తంగా ఎపి విద్యావ్యవస్థ గురించి చర్చ జరుగుతోందన్నారు. ఇప్పుడు మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదని, ఇతర దేశాలతో అని చెప్పారు. విద్యావ్యవస్థలో అన్ని సమస్యలను ఒకేరోజు పరిష్కరించడం సాధ్యం కాదని, ప్రాధాన్యత క్రమంలో అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. సింగపూర్ టూర్ ద్వారా ఉపాధ్యాయులు వివిధ అంశాలపై కెపాసిటీ బిల్డింగ్ పై శ్రద్ధవహించాలని సూచించారు. సింగపూర్ అధ్యయన యాత్రలో తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటిని అమలు చేయడానికి గల అవకాశాలను ఉపాధ్యాయులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, ఎస్‌‌సిఇఆర్‌‌టి డైరెక్టర్ ఎం.వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్