- పొగాకు బోర్డు తీరుపై వక్తల ఆగ్రహం
ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : పొగాకు రైతుల సంక్షేమం కోసం ఏర్పాటైన పొగాకు బోర్డు రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి కార్పొరేట్ కంపెనీలకు తొత్తుగా మారిందని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు లేకుంటే పొగాకు బోర్డు ఉనికే ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం, పొగాకు బోర్డు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.వెయ్యి కోట్లు కేటాయించి ఎస్‌టిసి, మార్క్‌ఫెడ్, పొగాకు సహకార సమాఖ్యల ద్వారా కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రకాశం భవన్ వద్ద చేపట్టిన పొగాకు రైతుల నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. సంయుక్త కిసాన్ మోర్చాజిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు సారధ్యంలో రైతు–కూలీ సంఘం జిల్లా నాయకులు ఎస్ లలితకుమారి, ఎఐకెఎస్ నాయకులు బి పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పొగాకు రైతుల కోసం ఏర్పడిన టుబాకో బోర్డులో రైతులకే ప్రాతినిధ్యం లేకుండా ఎవరో పెత్తనం చేయడం దారుణమన్నారు. గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వానిది, బోర్డుది బాధ్యత కాదా అని ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన ధరే అమలు కాకపోతే ప్రభుత్వ మాటకు విలువ ఏమిటని విమర్శించారు. పొగాకు కొనుగోళ్లలో ఐటిసి, జిపిఎ వంటి కార్పొరేట్ కంపెనీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయన్నారు.
ఉద్యోగుల మాదిరిగానే రైతులకు కూడా గౌరవప్రదమైన జీవన హక్కు కల్పించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని, లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి అజయ్‌కుమార్, ఎన్‌టిఆర్ కళాపరిషత్ చైర్మన్ ఇ హరిబాబు, రాష్ట్ర సేవా సమాఖ్య అధ్యక్షులు బి వెంకట్రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎస్‌కె సైదా మాట్లాడారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు సంఘ జిల్లా అధ్యక్షులు పమిడి వెంకటరావు, ఉపాధ్యక్షులు ఎస్ కె మాబు తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)