ముంబయి : అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో ఆసియా స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలను చవిచూశాయి. టెక్ స్టాక్స్‌లో చోటుచేసుకున్న విక్రయాల ప్రభావితంతో శుక్రవారం ఆసియా దేశాల ప్రధాన సూచీలు కుప్పకూలాయి. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ ఇండెక్స్ ఏకంగా 8 శాతం మేర పతనమవ్వడంతో ట్రేడింగ్‌ను 20 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఇదే బాటలో జపాన్ నిక్కీ 5 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 2.4 శాతం, చైనా బ్లూచిప్ సిఎస్‌ఐ 300 ఇండెక్స్ 2.9 శాతం, షాంఘై కాంపోజిట్ 2 శాతం చొప్పున క్షీణించాయి. భారత మార్కెట్లకు మొహరం సెలవు కావడంతో ఇక్కడి ఇన్వెస్టర్లు పెను ప్రమాదం నుండి తప్పించుకున్నట్లయ్యింది. ప్రధానంగా అమెరికాలోని టెక్ దిగ్గజాల షేర్ల క్షీణత ఈ భారీ పతనానికి కారణమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) మౌలిక సదుపాయాల కోసం కంపెనీలు చేస్తున్న భారీ పెట్టుబడులు.. దీర్ఘకాలంలో ఆశించిన ఫలితాలను ఇస్తాయా లేదా అన్న అనుమానాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. మెమొరీ, స్టోరేజీ చిప్‌ల ధరలు పెరగడంతో ఆపిల్ సంస్థ తన ఉత్పత్తుల ధరలను పెంచడం, సెమీకండక్టర్ల కొరత వంటి అంశాలు బిగ్ టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా ఆపిల్ షేరు ఒక్కరోజే 6.1 శాతం పతనమై, సుమారు 25 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. అలాగే ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు కూడా భారీగా పడిపోయాయి. దీనివల్ల చైనాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ 5 శాతం, 5జి కమ్యూనికేషన్ ఇండెక్స్ 6.3 శాతం, హాంగ్‌సెంగ్ టెక్ ఇండెక్స్ 3.3 శాతం చొప్పున పతనమయ్యాయి. గత జూన్ 23న కూడా ఇదే తరహా అమ్మకాల ఒత్తిడిని ఆసియా మార్కెట్లు ఎదుర్కోగా.. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం కావడంతో గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
Print Editionఆసియా మార్కెట్లలో భారీ కుదుపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)