హైదరాబాద్ : ‘అందరికీ వంట చేసే వాళ్లు దొరకరు’ అంటూ ఓ నెటిజన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యకు సింగర్ చిన్మయి గట్టి కౌంటరిచ్చారు. పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఆ ఘటనపై సినిమా తీయాలని దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో కోరాడు. దీనికి స్పందించిన రాహుల్, సమాజంలో శతాబ్దాలుగా మహిళలను అణగదొక్కే వ్యవస్థ కొనసాగుతోందని, తన చుట్టూ ఎంతోమంది మహిళలు మౌనంగా అన్యాయాలను భరించడం చూశానని చెప్పారు. అలాంటి వాస్తవ పరిస్థితులనే తన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో ప్రతిబింబించానన్నారు.
భవిష్యత్తులో ఆసక్తికరమైన కథ దొరికితే మహిళ చేసిన నేరంపై కూడా సినిమా తీసే అవకాశం ఉందని, అయితే మహిళలు పురుషులపై చేసే నేరాలను ఒకే కోణంలో చూపిస్తూ సాధారణీకరించే ప్రయత్నం మాత్రం చేయనని స్పష్టం చేశారు. ఆ రెండు అంశాలకు స్పష్టమైన తేడా ఉందని పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన భార్య, గాయని చిన్మయి స్పందించారు. రాహుల్ అందరిలా ఆలోచించే వ్యక్తి కాదని, అలాంటి దృక్పథం కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. ఈ పోస్టుకు స్పందించిన ఓ నెటిజన్ ‘అందరికీ వంట చేసే వాళ్లు దొరకరు’ అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేయగా, చిన్మయి ఘాటుగా బదులిచ్చారు. ఇంట్లో తల్లి చేసే వంటను కొందరు తక్కువ చేసి మాట్లాడటం బాధాకరమని అన్నారు. అదే సమయంలో స్టార్ హోటళ్లలో పనిచేసే ప్రముఖ చెఫ్‌లలో ఎక్కువ మంది పురుషులేనని గుర్తుచేశారు. వంట చేయడాన్ని మహిళల బాధ్యతగా మాత్రమే చూడటం సరైన దృక్పథం కాదని ఆమె స్పష్టం చేశారు.









కామెంట్‌లు (0)