ఒక మహిళ గౌరవం ఇప్పటికీ ఆమె దుస్తుల పరిమాణం, పొడవు, ఆకృతితో ఎందుకు ముడిపడి ఉంది? చేతులకు ఉండే స్లీవ్‌ల పొడవుతో ఆమె వ్యక్తిత్వాన్ని ఎందుకు కొలుస్తున్నారు? మెడ చుట్టూ ఉండే దుస్తులతో నైతికతను ఎందుకు నిర్ణయిస్తున్నారు? భారతదేశ చరిత్ర మాత్రం దీనికి భిన్నమైన కథ చెబుతోంది. శతాబ్దాలుగా వివిధ సమాజాలకు చెందిన మహిళలు భిన్నమైన దుస్తులు ధరించారు. ప్రాంతాలు, కులాలు, వాతావరణ పరిస్థితులను బట్టి ఆచారాలు మారాయి. హిందూమతం ఆమోదించిన ఒకే ఒక్క వస్త్రం అంటూ సార్వత్రిక నియమం ఏదీ లేదు. రక్షాబంధన్ సందర్భంగా ‘గివా’ కంపెనీ ప్రదర్శించిన యాడ్ చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న చర్చను చూస్తే.. ‘పితృస్వామ్యం సరిగ్గా ఇలానే పనిచేస్తుంద’ని చెప్పాలి. సంస్కృతి ‘ప్రమాదంలో పడింది’ అని దానికి అనిపించినప్పుడు, పరిస్థితులను మళ్లీ తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అది ముందుగా ఒక మహిళ శరీరాన్నే లక్ష్యంగా చేసుకుంటుంది.
సాధారణంగా భారతీయులుగా మహిళలను గౌరవించే, స్త్రీత్వాన్ని వేడుకగా జరుపుకునే నాగరికతకు చెందినవారమని చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. దేవతలను పూజిస్తాం. ఖజురాహో, కోణార్క్ శిల్పాలను ఆస్వాదిస్తాం. హిందూమతంలోని వైవిధ్యం, విశాలత్వం గురించి మాట్లాడతాం. ఇంత విశాల భావజాలం ఉన్న సమాజంలో ఒక మహిళ స్లీవ్‌లెస్ టాప్ ధరించడం మాత్రం చాలామందికి అసౌకర్యం కలిగిస్తోంది. అంటే.. మహిళ గౌరవం, నైతికత ఆమె ధరించిన దుస్తులను బట్టి నిర్ణయించవచ్చనే భావన నుంచి మనం ఇంకా పూర్తిగా బయటపడలేదు. మహిళలు ఏం ధరించాలి, ఎలా కనిపించాలి, తమను తాము ఎలా ప్రదర్శించుకోవాలి అనే విషయాల్లో నియంత్రణ కొనసాగుతూనే ఉంది. అయితే ఆ నిర్ణయాలు తీసుకునే, వాటిని ఆమోదించే, వాటి ద్వారా లాభాలు పొందే పురుషులు మాత్రం చాలా సౌకర్యవంతంగా పక్కనే ఉండిపోతారు.
సంస్కృతి పేరిట నైతిక పోలీసింగ్..
‘గివా’ కంపెనీ యాడ్‌లో కృతి సనన్ ధరించిన దుస్తులపై ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు రావడంతో ఒక్క రోజులోనే ఆ యాడ్‌ను తొలగించారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలను మరింత పెంచాయి. ‘బికినీ లేదా లోదుస్తులు ధరించి రాఖీ ఎలా కడతారు?’ అని తనను తాను ‘సనాతన్’గా అభివర్ణించుకునే కంగనా ప్రశ్నించారు. అదే పోస్టులో ఆమె నేటి మహిళను ‘గ్లోబల్ ఉమెన్’గా అభివర్ణించారు. ప్రజలకు ఒక ప్రకటన నచ్చకపోవడం తప్పు కాదు. సృజనాత్మక ఎంపికలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఆ దుస్తులు తమ దృష్టిలో రక్షాబంధన్‌కు సరిపోవని చెప్పవచ్చు. ఆ ప్రకటనను చూడకూడదని నిర్ణయించుకోవచ్చు. కానీ ఒక మహిళ దుస్తులను ‘లోదుస్తులు’గా పేర్కొంటూ బహిరంగంగా అవమానించడం సాంస్కృతిక విమర్శ కాదు, అది నైతిక పోలీసింగ్.
కృతి దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసిన కంగనా విషయానికి వస్తే.. సినీ పరిశ్రమలో దుస్తుల ఎంపిక ఎలా జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు. ఒక ప్రకటనలో నటీనటులు ధరించే దుస్తులు వారి వ్యక్తిగత నిర్ణయాలు మాత్రమే కావు. క్రియేటివ్ డైరెక్టర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, నిర్మాతలు, ఫొటోగ్రాఫర్లు, మార్కెటింగ్ అధికారులు, బ్రాండ్ ప్రతినిధుల ఆమోదం వంటి అనేక దశల తర్వాతే అవి తెరపై కనిపిస్తాయి. ఆమె కూడా వివిధ సందర్భాల్లో అలాంటి దుస్తులు ధరించిన నటియే. కానీ, తరచూ తన రాజకీయ భావజాలానికి అనుగుణంగా ఆమె విమర్శలు చేస్తుంటారు. ఇది కంగనా ద్వంద్వ ప్రవృత్తి!
మన సంప్రదాయం ఇంత సంకుచితమా?
మానవ శరీరాన్ని ఎలాంటి సంకోచం లేకుండా ఆలయ శిల్పాల్లో ప్రతిబింబించిన నాగరికత పుట్టిన దేశం మనది. ఖజురాహో, కోణార్క్ వంటి ఆలయాలు దీనికి చారిత్రక ఉదాహరణలు. వివిధ రూపాల్లో దేవతలను ఊహించిన హిందూమతం.. అలంకరించిన, అలంకరణలేని, ఉగ్ర, మాతృమూర్తి, తపస్విని, సౌందర్యభరిత రూపాల్లో స్త్రీత్వాన్ని దర్శించింది. అంటే భారతీయ సంప్రదాయంలో వైవిధ్యానికి స్థానం ఉంది. ఒకే రూపాన్ని, ఒకే దుస్తులను, ఒకే జీవనశైలిని అందరికీ రుద్దడం దాని స్వభావం కాదు. అందుకే ‘సంప్రదాయం’ పేరుతో మహిళల దుస్తులపై నియంత్రణను సమర్థించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఈ వివాదంపై స్పందిస్తూ కృతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పిన మాటలు అసలు సమస్యను చాలా స్పష్టంగా చూపించాయి. పండుగల సారాంశం మనం ధరించే దుస్తుల్లో ఉండదని, సంప్రదాయాల పట్ల మనకున్న భావోద్వేగం, వాటి అర్థంలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ‘మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతాం?’ అని ప్రశ్నించారు. అదే అసలు విషయం. సంప్రదాయం మన హృదయంలో ఉండాలి. మహిళ మెడ భాగంలో కాదు. ఇతరుల సౌకర్యానికి అనుగుణంగా దుస్తులు ధరించడమే సంప్రదాయాన్ని గౌరవించడం అని మహిళలకు చెప్పడం సంప్రదాయం కాదు. నియంత్రణ.
జాకెట్ కంటే పెద్ద ప్రశ్నలు
ఈ ఘటనలో ఆందోళన కలిగించేది ప్రజల్లో వచ్చిన ఆగ్రహం మాత్రమే కాదు. మన బహిరంగ చర్చలు ఏ విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయన్నదే అసలు సమస్య. ప్రధాన టెలివిజన్ మీడియాల్లో గంటల తరబడి కృతి ధరించిన దుస్తులు, ఆమె మెడ భాగం ఎంత కనిపించింది అనే అంశాలపైనే చర్చలు జరుగుతున్నాయి. ఆమె దుస్తులు ‘సరైనవేనా?’ అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక మహిళ జాకెట్ దేశవ్యాప్తంగా ఇంతటి ఆగ్రహాన్ని రేకెత్తించడం, దోషిగా తేలిన అత్యాచార నిందితుడు పదేపదే జైలు నుంచి బయటకు వస్తుండటం కంటే మనకు ఎక్కువ సమస్యగా అనిపిస్తోందా? కట్న వేధింపుల కారణంగా మహిళలు చనిపోతున్నప్పుడు ఈ నైతిక ఆగ్రహం ఎక్కడ ఉంటుంది? బాధితులు న్యాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నప్పుడు ఈ ఆగ్రహం ఎక్కడ ఉంటుంది? బాలికలు చదువును మధ్యలోనే ఆపాల్సి వస్తున్నప్పుడు ఈ చర్చలు ఎక్కడ ఉంటాయి? మహిళలు ఉద్యోగాలు, కెరీర్‌లు వదులుకోవాల్సి వస్తున్నప్పుడు ఈ సాంస్కృతిక ఆందోళన ఎక్కడ ఉంటుంది? మహిళలపై జరుగుతున్న హింస కంటే వారి భుజాలు ఎందుకు ఎక్కువగా అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయి? కారణం ఒక్కటే. అధికారాన్ని ప్రశ్నించడం కంటే మహిళలను నియంత్రించడం సులభం.
రక్షాబంధన్ మనకు నేర్పాల్సింది ఇదే..
రక్షణ అనే భావనకు కేంద్రబిందువుగా ఉన్న రక్షాబంధన్ సమయంలోనే ఈ వివాదం చోటుచేసుకోవడం ఒక విచిత్రమైన వైరుధ్యం. భారత సమాజానికి నిజమైన ప్రమాదం కృతి ధరించిన దుస్తులు కాదు. ఒక కుక్కకు రాఖీ కట్టడం కూడా కాదు. సృజనాత్మక స్వేచ్ఛ కూడా కాదు. నియంత్రణను సంస్కృతిగా, మహిళలపై నిఘాను రక్షణగా, ఆగ్రహాన్ని నైతికతగా భావించే మన ఆలోచనా విధానమే అసలు సమస్య. ఒకప్పుడు వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని జరుపుకున్న నాగరికత ఇప్పుడు మహిళల మెడ భాగం ఎంత కనిపిస్తుందనే అంశంపై జాతీయ స్థాయిలో విచారణలు నిర్వహిస్తోంది. ఈ ఆలోచనా విధానాన్ని మనం ప్రశ్నించకపోతే... సంప్రదాయాలను కాపాడుతున్నామని చెప్పుకుంటూనే, వాటిని విలువైనవిగా చేసిన విశాలత్వాన్నే నిశ్శబ్దంగా వదులుకోవాల్సి వస్తుంది.








కామెంట్‌లు (0)