ఆరుగురి నిర్బంధంతో హింసాత్మక నిరసనలు
టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురికి గాయాలు
న్యూఢిల్లీ : మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో శనివారం రాత్రి ఆరుగురు గ్రామస్తుల నిర్బంధంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. మోట్బంగ్ తదితర ప్రాంతాల్లో ఆందోళనకారులు రహదారులపై టైర్లు దహనం చేశారు. నిరసనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. పలుమార్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి. ఆందోళనల్లో కొందరు గాయపడగా, వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న గ్రామ వాలంటీర్లను భద్రతా బలగాలు అనంతరం విడుదల చేశాయని, దీంతో నిరసనలు ఆగిపోయినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
కాంగ్‌పోక్పిలో ఉద్రిక్తత
కుకీ గ్రూపునకు చెందిన కొందరు ప్రజలు శనివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మోట్బంగ్, పరిసర ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. క్హోలెన్ గ్రామానికి చెందిన ఆరుగురిని భద్రతా బలగాలు ఎలాంటి కారణం వెల్లడించకుండా అదుపులోకి తీసుకున్నాయని ఆందోళనకారులు ఆరోపించారు. నాగా ఆధిపత్యం ఉన్న చావాంగ్‌కినింగ్ గ్రామానికి సమీపంలో ఉన్న క్హోలెన్ గ్రామంపై ఇటీవల సాయుధ దుండగులు దాడి చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రామస్తుల నిర్బంధం మరింత ఆగ్రహానికి దారితీసింది. ఆందోళనకారులు రహదారులపై టైర్లు తగలబెట్టడంతోపాటు ప్రభుత్వ వాహనాలపై రాళ్లు రువ్వారు. భద్రతా బలగాల వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు మోట్బంగ్ వద్ద ఇంఫాల్–దిమాపూర్ జాతీయ రహదారి-2లోని కొంతభాగాన్ని భారీ నిర్మాణ పరికరాలతో తవ్వారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం : మాజీ సీఎం ఇబోబి విమర్శలు
మణిపూర్‌లో శాంతిభద్రతలను కాపాడటంలో. రాజ్యాంగబద్ధ బాధ్యతను నిర్వర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, మణిపూర్ ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని విమర్శించారు. ఇక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం తగిన ప్రయత్నాలు చేయలేదని అన్నారు. రాష్ట్రంలోని సమాజాలను విభజించిన ఇరు ప్రభుత్వాలకు ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.








కామెంట్‌లు (0)