ఏ ప్రజాస్వామ్య ఉద్యమమైనా మొదట వీధుల్లో మొదలవుతుంది. కానీ అది దేశవ్యాప్త చర్చగా మారాలంటే సమాజంలోని వివిధ వర్గాల మద్దతు అవసరం. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమంలో అదే జరిగింది. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రశ్నలు సంధిస్తుండగా, కొద్ది రోజుల్లోనే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా స్పందించడం ప్రారంభించారు. మొదట సామాజిక మాధ్యమాల ద్వారా సంఘీభావం వ్యక్తమైంది. తర్వాత బహిరంగ ప్రకటనలు వెలువడ్డాయి. అనంతరం కొందరు నేరుగా నిరసన వేదికలకు వెళ్లి విద్యార్థులతో కలిసి నిలిచారు.
మొదట బాలీవుడ్ నుంచి పూజా భట్, దియా మీర్జా, సోనుసూద్, విర్ దాస్, సోహా అలీ ఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, అదితి రావు హైదరీ, రోహిత్ సరాఫ్ తదితరులు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. షబానా ఆజ్మీ, హుమా ఖురేషీ, సాకిబ్ సలీమ్ నేరుగా జంతర్‌మంతర్‌కు వెళ్లి విద్యార్థులను కలిసి సంఘీభావం ప్రకటించారు. శేఖర్ సుమన్ విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
మలయాళ సినీ పరిశ్రమ స్పందన మరింత సంఘటితంగా కనిపించింది. మమ్ముట్టి, మంజు వారియర్, దుల్కర్ సల్మాన్ బహిరంగంగా మద్దతు ప్రకటించగా, కొచ్చిలోని మహారాజాస్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సంఘీభావ కార్యక్రమంలో జోజు జార్జ్, ఆశిక్ అబూ, మహేశ్ నారాయణన్, మను అశోకన్, శాంతి బాలచంద్రన్, బేబీ జీన్, ఎన్.ఎస్. మాధవన్, కె.ఆర్. మీరా తదితరులు పాల్గొన్నారు. ఒక వేదికపై కళాకారులు, రచయితలు, సినీ కార్యకర్తలు కలిసి విద్యార్థులకు సంఘీభావం తెలపడం ఈ స్పందనను ప్రత్యేకంగా నిలబెట్టింది. తమిళ సినీ రంగం నుంచి కమల్ హాసన్, జ్యోతిక విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. కన్నడ సినీ రంగం నుంచి చేతన్ అహింస తదితరులు సంఘీభావం ప్రకటించారు. తెలుగు సినీ రంగం నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రమే బహిరంగంగా విద్యార్థుల పక్షాన నిలిచారు. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ ఉద్యమంపై తెలుగు చిత్ర పరిశ్రమలోని ఇతర ప్రముఖులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. దక్షిణాది ఇతర భాషల సినీ రంగాలతో పోలిస్తే తెలుగు పరిశ్రమలో కనిపించిన ఈ మౌనం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఉద్యమాల వెన్నంటి కళాకారులు
విద్యార్థి ఉద్యమానికి కళాకారులు మద్దతు తెలపడం కొత్త విషయం కాదు. భారతదేశంలో ప్రజా ఉద్యమాలకు కళాకారులు అండగా నిలిచే సుదీర్ఘ సంప్రదాయానికి ఇది మరో ఉదాహరణ. స్వాతంత్ర్యోద్యమం నుంచి రైతు, కార్మిక, విద్యార్థి, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాల వరకు ప్రతి దశలో రచయితలు, నటులు, దర్శకులు, నాటకకారులు ప్రజల పక్షాన నిలిచారు. కళ కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాదని, సమాజాన్ని ప్రశ్నించే శక్తిగా కూడా ఉండాలనే భావనతో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఐపీటీఏ - ఇప్టా) పనిచేసింది. నాటకాలు, పాటలు, కవిత్వం, సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ కళను సామాజిక మార్పుకు సాధనంగా మలిచింది. ప్రజల జీవితాలకు దూరంగా కాకుండా వారి పోరాటాలతో మమేకమయ్యే సాంస్కృతిక సంప్రదాయానికి బలమైన పునాది వేసింది. తరువాతి తరాల రచయితలు, సినీ కళాకారులు, రంగస్థల కార్యకర్తలపై కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లిన వారిలో బలరాజ్ సహ్నీ, భీష్మ్ సహ్నీ, కైఫీ ఆజ్మీ, సఫ్దర్ హష్మీ, హబీబ్ తన్వీర్, గిరీష్ కర్నాడ్, మహాశ్వేతా దేవి వంటి ప్రముఖులు ప్రత్యేకంగా నిలిచారు. బలరాజ్ సహ్నీ ప్రజల జీవితాలను ప్రతిబింబించే వాస్తవిక నటనకు ప్రతీకగా నిలవగా, భీష్మ్ సహ్నీ తన రచనల ద్వారా సామాజిక విభజనలు, మానవీయ విలువలను శక్తివంతంగా ప్రతిబింబించారు. కైఫీ ఆజ్మీ కవిత్వాన్ని సామాజిక చైతన్యానికి ఆయుధంగా మలిచారు. వీధి నాటకాల ద్వారా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన సఫ్దర్ హష్మీ భారత సాంస్కృతిక ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించారు. హబీబ్ తన్వీర్ జానపద కళారూపాలను ఆధునిక రంగస్థలంతో మేళవించి ప్రజా సమస్యలను ముందుకు తీసుకువచ్చారు. గిరీష్ కర్నాడ్ చరిత్ర, పురాణాలను సమకాలీన ప్రశ్నలతో అనుసంధానించగా, మహాశ్వేతా దేవి అణగారిన వర్గాల జీవన పోరాటాలను తన రచనల కేంద్రంగా నిలిపారు. కైఫీ ఆజ్మీ వారసత్వాన్ని ఆయన కుమార్తె షబానా ఆజ్మీ ముందుకు తీసుకెళ్లగా, ప్రకాశ్ రాజ్, కమల్ హాసన్, శేఖర్ కమ్ముల, చేతన్ అహింస వంటి కళాకారులు కూడా వివిధ ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి అంశాలపై స్పందించడం కళాకారుల సామాజిక బాధ్యతలో భాగమనే భావనకు వారు ప్రతినిధులుగా నిలిచారు.
భారతదేశంలో ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన ఉద్యమాలు చివరికి సాహిత్యం, సినిమా, నాటకం, సంగీతానికి కూడా స్ఫూర్తిగా మారడం ఎన్నోసార్లు జరిగింది. స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన, రైతు ఉద్యమాలు ఇందుకు ప్రముఖ ఉదాహరణలు. ఈ ఉద్యమాల ప్రభావంతో అనేక కథలు, నవలలు, కవిత్వం, నాటకాలు, సినిమాలు పుట్టుకొచ్చాయి. ప్రజల పక్షాన నిలిచిన కళాకారుల జోక్యం వల్లే ఈ ఉద్యమాలు విస్తృత సామాజిక చర్చకు దారితీశాయి. ఈ విద్యార్థి ఉద్యమం కూడా అదే చారిత్రక సంప్రదాయానికి కొనసాగింపుగా నిలిచింది. విద్యార్థుల స్వరం దేశవ్యాప్తంగా వినిపించేలా చేయడంలో, సమాజంలోని ఇతర వర్గాల దృష్టిని ఆ సమస్యవైపు మళ్లించడంలో కళాకారులు తమ బాధ్యత నెరవేర్చారు. ఉద్యమాలు మారతాయి. తరాలు మారతాయి. కానీ ప్రజల పక్షాన నిలిచే కళాకారుల సంప్రదాయం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్య సమాజంలో కళాకారుల సామాజిక బాధ్యత ఎంత ముఖ్యమో ఈ విద్యార్థి ఉద్యమం మరోసారి గుర్తు చేసింది.
వీరి తీరే వేరు!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కల్యాణ్ మొదటినుంచి బీజేపీ అజెండాను వినిపించడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపించారు. సి.జె.పి. ఏర్పడిన ప్రారంభంలోనే ఢిల్లీ వెళ్లి ఉద్యమంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 20వ తేదీన విద్యార్థుల ర్యాలీ విజయవంతంగా సాగి, అనంతరం ఉద్యమ అణచివేతపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత కూడా ఆయన ఉద్యమాన్ని విమర్శించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థి ఉద్యమంలోకి అరాచక శక్తులు ప్రవేశించాయని ఆధారరహిత ఆరోపణలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను కేంద్రంలోని బీజేపీ నాయకులు కూడా 20వ తేదీ తర్వాత చేయడానికి సాహసించలేదు. పవన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ వాదనను సమర్థిస్తూ విద్యార్థి ఉద్యమాన్ని విమర్శించిన వారిలో బీజేపీ ఎంపీ, సినీనటి కంగనా రనౌత్ కూడా ఉన్నారు.
- ప్రజాశక్తి సినిమా డెస్క్








కామెంట్‌లు (0)