సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ పురస్కారాలకు కాషాయ కళంకం!

21 గంటల క్రితం

film awards
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 02:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలకు ప్రకటించిన ఈ పురస్కారాల్లో 'ఆర్టికల్ 370' ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' చిత్రానికి ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు వచ్చింది. 'అమరన్' చిత్రానికి ఉత్తమ దర్శకుడి పురస్కారం లభించింది. మరోవైపు మలయాళ చిత్రాలైన 'మంజుమ్మెల్ బాయ్స్', 'ఆడుజీవితం', 'కిష్కింధా కాండం', అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రధాన గుర్తింపు పొందలేదు. దీంతో మరోసారి జాతీయ పురస్కారాల ఎంపికలపై చర్చ మొదలైంది.

కాశ్మీర్, బీజేపీ తరహా జాతీయవాదం, సావర్కర్ వంటి అంశాలపై రూపొందిన చిత్రాలకు ప్రధాన గుర్తింపు లభిస్తుండగా, మానవీయ విలువలు, సామాజిక న్యాయం, కార్మికుల జీవితం, మహిళల అనుభవాలు, అణగారిన వర్గాల పోరాటాలను ప్రతిబింబించిన చిత్రాలు ఎందుకు చిన్నచూపునకు గురయ్యాయన్న ప్రశ్న సినీ విమర్శకుల నుంచి వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు నేపథ్యం లేకపోలేదు. గత కొన్నేళ్లుగా జాతీయ పురస్కారాల ఎంపికను పరిశీలిస్తే ఒక రాజకీయ నిర్ణయాన్ని సమర్థించే లేదా జాతీయవాద కథనాన్ని ముందుకు తీసుకొచ్చే చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది.

మారుతున్న ధోరణి

2019లో విడుదలైన 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాన్ని ఆధారంగా తీసుకుంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటం ప్రధానంగా కనిపించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటనకు జాతీయ పురస్కారం లభించింది. ఆమె బీజేపీకి అనుకూలంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ అవార్డుపై రాజకీయ చర్చ కూడా జరిగింది. మరోవైపు 2021లో విడుదలైన 'జై భీమ్' పోలీసు కస్టడీ హింస, కుల వివక్ష, రాజ్యాంగ హక్కులు, అణగారిన గిరిజన కుటుంబం న్యాయం కోసం చేసిన పోరాటాన్ని అత్యంత ప్రభావవంతంగా చూపించింది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నప్పటికీ జాతీయ పురస్కారాల్లో ఆశించిన స్థాయి గుర్తింపు దక్కకపోవడం సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సినిమా సామాజిక న్యాయం గురించి మాట్లాడటం అనేది బీజేపీ రాజకీయాలకు భిన్నంగా ఉండటమే అందుకు కారణమని అప్పట్లో విమర్శకులు అభిప్రాయపడ్డారు. 2022లో విడుదలైన 'ది కాశ్మీర్ ఫైల్స్' 1990లో కాశ్మీరీ పండితుల వలసలను ఆధారంగా తీసుకుంది. ఈ చిత్రానికి జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రం పురస్కారం లభించింది. ఈ సినిమా చారిత్రక సంఘటనను ఏకపక్షంగా చూపిందని, ముస్లింలను ప్రతికూలంగా చిత్రీకరించిందని, సామాజిక విభజనను పెంచే విధంగా కథను నిర్మించిందని విమర్శలు వచ్చాయి.

2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ'పై కూడా తీవ్ర వివాదం చెలరేగింది. కేరళలో వేలాది యువతులను ఐఎస్‌లో చేర్చారన్న అబద్ధపు ప్రచారంతో నిర్మితమైన ఈ సినిమా పట్ల విమర్శలు వచ్చాయి. కానీ, బీజేపీ నాయకులు బహిరంగ మద్దతు ప్రకటించడంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సినిమాకు పన్ను మినహాయింపులు కూడా ప్రకటించాయి. అనంతరం ఈ చిత్రానికి జాతీయ పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో గుర్తింపు లభించింది.

ఈసారి కూడా ...

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అదే తీరు పునరావృతమైంది. ఉత్తమ చిత్రంగా పురస్కారం పొందిన 'ఆర్టికల్ 370' జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చుట్టూ తిరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయాన్నే ఈ సినిమా అదే దృక్కోణంతో తెరపై చూపిస్తుంది. ఇప్పటికే ప్రజల ముందు ఉన్న రాజకీయ వాదనను థ్రిల్లర్ రూపంలో మళ్లీ చెప్పడం మాత్రమే ఒక చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలబెట్టడానికి సరిపోతుందా? 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' చిత్రానికి కూడా జాతీయ పురస్కారం లభించింది. సావర్కర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చిత్రంలో ఆయనను విప్లవకారుడిగా ప్రతిష్ఠించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన రాసిన క్షమాభిక్ష పత్రాలు చారిత్రక పత్రాలుగా ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. గాంధీ హత్య కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావితమైంది. అలాంటి వ్యక్తి జీవిత కథకు అవార్డు ఇవ్వటం పూర్తిగా బీజేపీ రాజకీయమే!

ఆ సినిమాలకు గుర్తింపు లేదేం?

ఇంతకన్నా గొప్ప సినిమాలు 2024లో రాలేదా? జ్యూరీ వాటిని ఎందుకు ఉన్నతంగా భావించలేదు? బెన్యామిన్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ రూపొందించిన 'ఆడుజీవితం' ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఒక యువకుడు బానిసలా జీవించాల్సి వచ్చిన పరిస్థితిని హృద్యంగా చూపిస్తుంది. ప్రపంచంలోని కోట్లాది వలస కార్మికుల జీవితాలను గుర్తు చేసే ఈ కథ మానవ గౌరవం గురించి గొప్ప ప్రశ్నను లేవనెత్తుతుంది. 'మంజుమ్మెల్ బాయ్స్' స్నేహం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని యువకుల కథ. 'కిష్కింధా కాండం' జ్ఞాపకశక్తి, కుటుంబ సంబంధాలు, అపరాధ భావన చుట్టూ తిరిగే సైకాలజికల్ డ్రామా. 'బ్రహ్మయుగం' అధికారం, భయం, ఆధిపత్యాన్ని ప్రతీకాత్మకంగా ఆవిష్కరించిన కళాత్మక చిత్రం. 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' అంతర్జాతీయంగా భారతీయ సినిమాకు అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మానవ గౌరవం, స్నేహం, మానసిక సంఘర్షణలు, అధికారం-బానిసత్వం, మహిళల అనుభవాలు వంటి విశ్వజనీన అంశాలను ప్రతిబింబించిన ఈ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందినా, జాతీయ పురస్కారాల్లో ఆశించిన గుర్తింపు లభించలేదు.

ఇదేనా కళకు గౌరవం?

ఒక సినిమా జాతీయ పురస్కారం పొందిందంటే అది ప్రతిభకో, ప్రత్యేకతకో, వైవిధ్యానికో ప్రతీకగా నిలవాలి. అంతేకానీ అధికార పార్టీ భావజాలానికి కొమ్ము కాసే వ్యక్తులకో, ప్రచార చిత్రాలకో పురస్కారాలు ఇస్తే అది మన సంస్థల పరువునే పోగొడుతుంది. కళను కొలిచే ఒకే కొలమానం ప్రపంచంలో ఎక్కడా లేదు. అయితే భారతీయ సినిమా ఏ విలువలను గౌరవిస్తోంది? భవిష్యత్ తరాలకు ఎలాంటి చిత్రాలను ఆదర్శంగా చూపిస్తోంది? అనే ప్రశ్నకు జాతీయ పురస్కారాలు ఉదాహరణగా నిలబడతాయి.

జాతీయ పురస్కారాల ఎంపికలో కళాత్మక ప్రతిభతో పాటు వైవిధ్యం కూడా కనిపించడం అవసరం. ఒకే రకమైన భావజాలాన్ని ప్రతిబింబించే చిత్రాలు వరుసగా అత్యున్నత గుర్తింపు పొందితే, మిగిలిన కథనాలు సహజంగానే అంచులకు నెట్టబడే ప్రమాదం ఉంటుంది. వైవిధ్యానికి, మానవీయ విలువలకు గుర్తింపు లేదన్న అభిప్రాయం సృజనకారుల్లో బలపడుతోంది. అన్ని రంగాల్లోలాగానే సినీరంగంలోనూ బీజేపీ పాలకులు సాగిస్తున్న ఈ ధోరణి కళాత్మక విలువలను కళంకపరుస్తుంది. ఇది వాంఛనీయం కాని అధికార జోక్యమని పలువురు సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు.

- ప్రజాశక్తి సినిమా డెస్క్‌


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్