ప్రభుత్వ ఉపాధ్యాయుల నిరసన
‘ఇరుముడి’ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను ప్రతికూలంగా చిత్రీకరించిన తీరుపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ఒక వృత్తి పట్ల బలమైన ప్రతికూల భావన కలిగించే సన్నివేశాలను సృష్టించడం దారుణమని పలువురు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఉపాధ్యాయులతో పాటు ఇతరులు కూడా సామాజిక మాధ్యమాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో చూపించిన పాఠశాల, విద్యార్థుల యూనిఫాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలతో పోలి ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు, అక్కడ పనిచేసే ఉపాధ్యాయులపై ప్రేక్షకుల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.
“సృజనాత్మక స్వేచ్ఛను ఎవరూ ప్రశ్నించడం లేదు. కానీ ఆ స్వేచ్ఛ పేరుతో ఒక వృత్తి మొత్తాన్ని కించపరిచేలా, ప్రజల్లో బలమైన ప్రతికూల భావోద్వేగాన్ని కలిగించే సన్నివేశాలను సృష్టించడం సమంజసం కాదు” అని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన లక్షలాది మంది పిల్లలకు విద్య అందిస్తూ, అనేక సవాళ్ల మధ్య విధులు నిర్వహిస్తున్నారని వారు గుర్తుచేస్తున్నారు. కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను చూపించేందుకు మొత్తం ప్రభుత్వ ఉపాధ్యాయ సమాజాన్ని ప్రతికూలంగా చిత్రీకరించడం సరికాదని అంటున్నారు. “ఒక ఉపాధ్యాయుడి పాత్రను ప్రతికూలంగా చూపించడం ఒక విషయం. కానీ ప్రభుత్వ పాఠశాల వాతావరణం, విద్యార్థులు, ఉపాధ్యాయుల వ్యవస్థ మొత్తాన్నీ ప్రతికూలంగా చూపించడం వల్ల ప్రేక్షకుల్లో ప్రభుత్వ పాఠశాలలపై తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది” అని వారు పేర్కొన్నారు. సినిమా సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమమని, అందువల్ల చిత్రీకరణలో సామాజిక బాధ్యత కూడా ఉండాలని అన్నారు. “ఉపాధ్యాయుడిని కించపరచడం అంటే విద్యను కించపరచడమే. ప్రభుత్వ పాఠశాలను కించపరచడం అంటే అక్కడ చదువుతున్న పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే” అని వారు పేర్కొంటున్నారు. “ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను మార్చాల్సిందిగా చిత్ర బృందాన్ని కోరుతున్నాం. ‘ఇరుముడి’ చిత్ర బృందం ఈ చిత్రణపై పునరాలోచించాలి.’’ అని కోరుతున్నారు.








కామెంట్‌లు (0)