భారతీయ సినీ పరిశ్రమ చాలాకాలంగా పురుషాధిపత్య రంగంగా కొనసాగుతోంది. నిర్ణయాల నుంచి పారితోషికం వరకు, కథల నుంచి పని విధానం వరకు ఎక్కువ సందర్భాల్లో పురుషులదే పైచేయి. అవకాశాలు కోల్పోతామనే భయంతో మహిళలు తమకు ఎదురైన సమస్యలను బహిరంగంగా చెప్పడానికి చాలాకాలం వెనుకాడారు. అయితే ఇటీవల పరిస్థితి మారుతోంది. కథానాయికలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెబుతున్నారు. పని గంటలు, పారితోషికం, పాత్రల ఎంపిక, వ్యక్తిగత గోప్యత, పని ప్రదేశంలో భద్రత వంటి అంశాలపై తమ నిర్ణయాలను వెల్లడిస్తున్నారు.
ఈ మార్పులో తాజా చర్చకు కారణమైన ఉదాహరణ దీపికా పదుకొణె. 2025లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘స్పిరిట్’ చిత్రంలో దీపిక నటిస్తారని వార్తలు వచ్చాయి. తర్వాత ఆమె ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. ఈ రెండు సినిమాల నుంచి ఆమె వైదొలగడానికి పని నిబంధనలపై విభేదాలే కారణమని అప్పట్లో మీడియా కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా రోజుకు ఎనిమిది గంటల పని షిఫ్ట్ కోరినట్లు వార్తలు వచ్చాయి. 2025 అక్టోబరులో బ్రూట్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎనిమిది గంటల పని దినాన్ని కోరడం అన్యాయమైన డిమాండ్ కాదని దీపిక అన్నారు. పురుష నటులు చాలాకాలంగా ఎనిమిది గంటల షిఫ్టుల్లో పనిచేస్తున్నారని, వారు అలా పనిచేసినప్పుడు అది వార్త కాలేదని, మహిళ అదే కోరినప్పుడు ఎందుకు చర్చగా మారుతుందని ప్రశ్నించారు. ఒక ఆర్టిస్టు ఎంతసేపు పనిచేస్తున్నారనేది వారి వృత్తి నిబద్ధతకు ప్రమాణం కాదన్నది ఆమె వాదన. పని సమయం, విశ్రాంతి, కుటుంబ జీవితం కూడా వృత్తి వ్యవస్థలో భాగమేనన్న చర్చను ఆమె ముందుకు తెచ్చారు. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సహా పలువురు కూడా ఎనిమిది గంటల పని విధానంపై స్పందించారు. నటి రాణి ముఖర్జీ కూడా కళాకారులు తమకు అనుకూలమైన పని విధానాన్ని ఎంచుకోవచ్చని, నిర్మాతలకు అది ఆమోదయోగ్యమైతే ఆ విధంగా పని చేయవచ్చని అన్నారు.
పారితోషికంపై చర్చ
పని గంటల తర్వాత సినీ పరిశ్రమలో మహిళల అసమానతపై ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం పారితోషికం. హీరోలతో పోలిస్తే కథానాయికలకు తక్కువ పారితోషికం రావడం చాలాకాలంగా ఉన్న సమస్యే. అయితే దీనిపై బహిరంగంగా మాట్లాడిన నటీమణుల్లో తాప్సీ పన్ను ముందువరుసలో నిలిచారు. 2019లో ‘గేమ్ ఓవర్’, 2020లో ‘థప్పడ్’ వంటి చిత్రాలతో తాప్సీ మహిళా కేంద్ర కథలను ఎంచుకుంటూ వచ్చారు. ‘థప్పడ్’ ప్రచార సమయంలో మహిళా పాత్రల మార్కెట్ విలువ, హీరో–హీరోయిన్ పారితోషికాల మధ్య తేడాపై ఆమె మాట్లాడారు. ఒక సినిమా కథను ప్రధానంగా మోసే మహిళా నటికి హీరోతో పోలిస్తే ఎందుకు అంత తక్కువ పారితోషికం ఇవ్వాలన్నదే ఆమె ప్రశ్న. పారితోషికం విషయంలో సోనమ్ కపూర్ కూడా 2021లో మాట్లాడారు. పురుష నటులతో పోలిస్తే మహిళా నటులకు ఇచ్చే పారితోషికంలో ఉన్న వ్యత్యాసాన్ని ఆమె ‘హాస్యాస్పదం’గా అభివర్ణించారు. ఈ అసమానతను ప్రశ్నించినందుకు కొన్ని అవకాశాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు.
కొంతమంది కథానాయికలు తమకు నచ్చని పాత్రలను తిరస్కరించడంతో పాటు, తమను తెరపై ఎలా చూపించాలన్న విషయంలోనూ స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందం, శరీరం, గ్లామర్ విషయంలో పరిశ్రమ పెట్టే ప్రమాణాలను ప్రశ్నించిన సందర్భాలు ఇందుకు ఉదాహరణలు. 2019లో సాయి పల్లవికి ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనలో నటించేందుకు రూ.2 కోట్ల పారితోషికం ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆమె ఆ ప్రకటనను తిరస్కరించారు. తన చర్మవర్ణాన్ని మార్చుకోవాలని చెప్పే ప్రకటనలో తాను నటిస్తే మహిళలకు తప్పుడు సందేశం వెళ్తుందని ఆమె వివరించారు. సినీ నటీమణులకు వచ్చే ప్రతి వాణిజ్య అవకాశాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదని, తమకు విరుద్ధమైన విలువలను ప్రచారం చేసే పనిని తిరస్కరించే స్వేచ్ఛ కూడా ఉందని సాయి పల్లవి స్పష్టం చేశారు. 2011లో వచ్చిన ‘ది డర్టీ పిక్చర్’లో సిల్క్ స్మిత పాత్ర పోషించిన తర్వాత విద్యా బాలన్ శరీరాకృతిపై కొంతమంది వ్యాఖ్యలు చేశారు. 2012లో ‘కహానీ’ విడుదలైన సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శరీరం ఎలా ఉండాలో తానే నిర్ణయించుకోవాలనే స్థితికి వచ్చానని చెప్పారు. తర్వాత కూడా తన బరువు కారణంగా ఎదురైన బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ, మహిళలను వారి రూపంతో కాకుండా వ్యక్తిత్వంతో చూడాల్సిన అవసరాన్ని వివరించారు.
సంఘటిత స్వరం
మహిళలు తమ పాత్రల విషయంలోనే కాదు, పరిశ్రమ వ్యవహార తీరుపైనా మాట్లాడటం మొదలుపెట్టారు. మలయాళ చిత్ర పరిశ్రమలో 2017లో ఏర్పడిన ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ దీనికి ముఖ్యమైన ఉదాహరణ. ఒక ప్రముఖ నటి అపహరణ, లైంగిక దాడి ఘటన తర్వాత పార్వతి తిరువోతు, రీమా కల్లింగల్, రేవతి, పద్మప్రియ తదితరులు కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యక్తిగతంగా స్పందించడం కంటే సంస్థాగత పరిష్కారాలు అవసరమని ఈ వేదిక వాదించింది. కేరళ వామపక్ష ప్రభుత్వం 2017లో జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. సినిమా రంగంలో మహిళల పని పరిస్థితులు, లింగ వివక్ష, లైంగిక వేధింపులు, వేతన అసమానతలు వంటి అంశాలను పరిశీలించిన కమిటీ నివేదిక సమర్పించింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. 2018లో మీటూ ఉద్యమం దేశంలో విస్తరించినప్పుడు సినీ రంగానికి చెందిన పలువురు మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను బహిరంగంగా వెల్లడించారు. అది ప్రత్యేకమైన పెద్ద చర్చ. ఇంతకుముందు ఒక నటి తనకు జరిగిన అన్యాయం గురించి చెబితే అది ఆమె వ్యక్తిగత సమస్యగా చూసేవారు. ఇప్పుడు అదే సమస్యను సినిమా రంగంలోని పని విధానంతో ముడిపెట్టి చూస్తున్నారు. ఒక మహిళకు భద్రత లేకపోతే అది ఆమె సమస్య మాత్రమే కాదు. ఫిర్యాదు చేయడానికి వ్యవస్థ లేకపోతే అది సంస్థ సమస్య. పని గంటలకు స్పష్టమైన విధానం లేకపోతే అది మొత్తం పరిశ్రమ పని సంస్కృతికి సంబంధించిన సమస్య అనే భావన విస్తృతమైంది.
నిర్ణయాధికారం వైపు అడుగులు
ఈ మార్పు తెరపై భాగస్వామ్యానికే పరిమితం కాలేదు. సినిమా నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతోంది. తాప్సీ పన్ను, సమంత వంటివారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం, ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయిలో నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పనిచేయడం, అనేక మంది నటీమణులు తమ సొంత నిర్మాణ సంస్థలను ప్రారంభించడం... ఇవన్నీ నిర్ణయాధికారం క్రమంగా మారుతున్నదానికి ఉదాహరణలు. ఇదే సమయంలో కథలు కూడా మారుతున్నాయి. ‘కహానీ’లో విద్యా బాలన్, ‘థప్పడ్’లో తాప్సీ పన్ను, ‘మహానటి’లో కీర్తి సురేష్, ‘గార్గి’లో సాయి పల్లవి, ‘మా ఇంటి బంగారంలో’ సమంత... మహిళను కథలో సహాయక పాత్రగా కాకుండా కథకు కేంద్రంగా నిలబెట్టాయి. ఈ సినిమాల విజయం మహిళా పాత్రలకు ఉండే ప్రాధాన్యాన్ని, ఆదరణను నిరూపించింది. ఇప్పటికీ నటీమణులకు, నటులకు మధ్య పారితోషిక వ్యత్యాసం భారీగానే ఉంది. దర్శకులు, ఛాయాగ్రాహకులు, రచయితలు, సాంకేతిక నిపుణుల వంటి కీలక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం కూడా ఇంకా తక్కువగానే ఉంది. మహిళలు తమ హక్కుల గురించి ఆలోచించడం, అడగటం మొదలైంది కాబట్టి, మార్పు కూడా సాధ్యమవుతుంది.
- ప్రజాశక్తి సినిమా డెస్క్







కామెంట్‌లు (0)