రెండు ఫుట్‌బాల్ మైదానాల కంటే పెద్దగా వుందంటున్న శాస్త్రవేత్తలు
చంద్రుడి ఉపరితలంపై రెండు ఫుట్‌బాల్ మైదానాల కంటే పెద్దదైన ఒక భారీ బిలాన్ని నాసా శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. సుమారు 728 అడుగుల వ్యాసం, 141 అడుగుల లోతు ఉన్న ఈ బిలం, 2024లో ఒక భారీ ఉల్క చంద్రుడిని బలంగా ఢీకొట్టడం వల్ల ఏర్పడిందని తెలిపారు. ఇటీవల సౌరవ్యవస్థలో నమోదైన అతిపెద్ద నూతన బిలం ఇది.
వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అత్యంత అరుదైన, భారీ ఉల్కాపాతం ఇదని నాసా స్పష్టం చేసింది. ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త థామస్ మెక్‌గెచిన్ గౌరవార్థం ఈ బిలానికి 'మెక్‌గెచిన్ క్రేటర్' అని పేరు పెట్టారు.
నాసాకు చెందిన 'లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్' (LRO) తీసిన చిత్రాలను పరిశీలిస్తుండగా, ఎల్‌ఆర్‌వో టీమ్ సభ్యుడు రాబర్ట్ వాగ్నర్ ఈ కొత్త బిలాన్ని మొదటిసారిగా గుర్తించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఆర్బిటర్ ద్వారా మరిన్ని స్పష్టమైన వివరాలను, చిత్రాలను సేకరించారు.
ఈ బిలం చుట్టూ ఉన్న 7 కిలోమీటర్ల ప్రాంతంలో రాత్రి వేళల్లో తీవ్రమైన చలి నమోదువుతోంది. ఉల్క వేగంగా వచ్చి పడినప్పుడు ఉపరితల మట్టి చెల్లాచెదురై, వేడిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోవడమే దీనికి కారణమని వివరించారు. చంద్రుడిపై ఉన్న ఎక్కువ భాగం బిలంలు కోట్ల సంవత్సరాల నాటివి. అయితే ఈ బిలం ఇటీవల ఏర్పడటంతో, భవిష్యత్తులో చంద్రుడిపైకి మానవులను, రోవర్లను పంపే పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.







కామెంట్‌లు (0)